ఈ ప్రశ్న జీవశాస్త్రజ్ఞుల తలల్ని తొలిచేస్తున్న వేళ ఎర్నెస్ట్ హేక్కెల్ అనే శాస్త్రవేత్త ఈ అవశేషాలు దక్షిణ ఆసియాలో ఎక్కడో ఒకచోట దొరకవచ్చని ఊహించి ఓ పటం మీద వేసి మరీ చూపించాడు. ఆ చోటే సుందా ద్వీపాలు. చెపితే సరిపోతుందా ఏది ఆధారం ?
ఈ ఆధారాన్ని వెలికి తీస్తానని ఒకాయన యూనివర్సిటీలోని సలక్షణమైన అనాటమీ లెక్చరర్ ఉద్యోగాన్ని వదులుకొని బయల్దేరాడు. అందుకోసం సైన్యంలో డాక్టరుగా చేరి సుమత్రా ద్వీపానికి చేరుకొన్నాడు. ఆయనే మన యూజెన్ ద్యుబువా.
ద్యుబువా క్షణం నిద్రపోలేదు. తీరిక సమయమంతా తవ్వకాలకే సరిపోయేది. వచ్చిన జీతమంతా అవశేషాల అన్వేషణకే కరిగిపోయేది. ఆ ఎముకలు ఎక్కడో ఉన్నాయి. ఉండి తీరతాయి. ఇదీ ద్యుబువా నమ్మకం. ఎక్కడున్నాయో తెలియదు. అయినా వాటిని పట్టుకొని తీరాలి. ఇదీ అతని దృఢ సంకల్పం. నెలలు గడుస్తున్నాయి. అవశేషాలు అంతు చిక్కలేదు. సంవత్సరాలూ దొర్లుతున్నాయి. అనుకొన్నది దొరకలేదు. అయినా మన ద్యుబువా పట్టు వదలని విక్రమార్కుడిలా తవ్వుతూనే ఉన్నాడు. సుమత్రాలో చిక్కేట్టు లేవని ఓ నిర్ధారణ కొచ్చేశాడు. ఇక వదులుకోవచ్చుగా, ఊహుఁ జావా ద్వీపానికి పలుగూ పారా తీసుకొని బయల్దేరాడు!
ఇంత పట్టుదల ఎందుకంటారా? నర వానరుడు మానవ పరిణామ క్రమంలో ఓ అపురూపమైన 'లింకు'. మాయమైన మాయదారి 'లింకు'! అది చిక్కితే ఓ బ్రహ్మముడి విడిపోతుంది.
ద్యుబువా కఠోరదీక్ష ఫలించింది. జావాలోని ట్రినిల్ గ్రామం దగ్గర ఎట్టకేలకు మానవ శిలాజం అతనికి చిక్కింది. ఒక తొడ ఎముకా, రెండు పళ్ళు, పుర్రె పై భాగం, కింది దవడ ఎముకా దొరికాయి. పరిసరాల్లో మరికొన్ని తొడ ఎముకలూ లభ్యమయ్యాయి. అంతే నరవానర రూపం ద్యుబువా ముందు ప్రత్యక్షమైంది. చదునైన నుదురు, కళ్ళపైన మందమైన ఎముకలూ, కోతికీ దగ్గరగా ఉన్న ముఖం అన్నిటికీ మించి మనిషికి అతి సన్నిహితమైన మెదడూ పిథెకాంత్రపస్ లక్షణాలని ద్యుబువా పసిగట్టేశాడు! ద్యుబువా ఆవిష్కరణ మీద ఎక్కడెక్కడి ఆగ్రహాలు వచ్చిపడ్డాయి. అసహ్యం ఎదురైంది. నిందలు నిత్యకృత్యాలయ్యాయి. 'మానవుడూ కోతీ బంధువులే ! ఎంత దుర్మార్గం' అంటూ చర్చి విరుచుకుపడింది. ఆ అవశేషాలు వేలాది, లక్షలాది ఏళ్ళవి కావని, ఇటీవలివని 'రుజువులు' సృష్టించేశారు !
అయినా ద్యుబువా నిలబడ్డాడు. తన వాదం విన్పించాడు. తన రుజువులు చూపించాడు. విజ్ఞాన శాస్త్రంలో ఈ అవశేషాల ప్రాముఖ్యం గుర్తించిన కొందరాయన పక్షాన చేరారు గానీ మానవ వంశంలో మాత్రం పీథెకాంత్రపస్‌కి స్థానం చిక్కలేదు.
చివరికి 20వ శతాబ్దపు తొలిరోజుల్లో చైనాలో దొరికిన అవశేషాల ఆధారంగా పిథెకాంత్రపస్‌కి ప్రాణం లేచి వచ్చింది. 'మాయమైన లింకు' మరిన్ని ఆధారాలతో చిక్కిపోయింది. ద్యుబువా కల నిజమైంది!
ఆధారం: 'మానవుడే మహాశక్తి సంపన్నుడు'
సైన్సు ఎలా పుట్టి పెరిగింది?
40