Jump to content

పుట:Science Ela Putti Perigindhi VBS JVV.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యురేనస్ గుట్టు ఎలా రట్టయింది?

నవగ్రహాలు పుట్టి ఎన్నికోట్ల సంవత్సరాలో గానీ ఏవి నవగ్రహాలో తేల్చుకోవడం మాత్రం కేవలం 150 సంవత్సరాల క్రితం మాత్రమే జరిగింది. ఈ అన్వేషణకు శాస్త్రజ్ఞులు వాడింది కేవలం కాగితాలూ, తమ తర్కమూ మాత్రమే. ఇలా నిర్ధారించుకొన్నాక తాము అనుకొన్నచోట అవి వున్నాయో లేదో అని వారు సరి చూచుకొన్నారు.

మన ప్రాచీనులు గ్రహాలు తొమ్మిదన్నారు. వారు చెప్పిన గ్రహాల్లో సూర్యుడు నక్షత్రమనీ, చంద్రుడు ఉపగ్రహమనీ, రాహుకేతువులు అస్తిత్వం లేని ఛాయాగ్రహాలనీ తర్వాత రుజువైంది. ఇక మిగిలినవి బుధుడు, శుక్రుడు, కుజుడు, గురుడు, శని అయిదు మాత్రమే. భూమి కూడా గ్రహమే అని తేలాక ఈ అంకె ఆరుకు చేరింది. భూమి మీది నుంచి పైన చెప్పిన గ్రహాలన్నీ కంటికి కనపడేవే. కాబట్టి గొడవలేదు.

1781 మార్చి 13న విలియం హెర్షెల్ అనే ఔత్సాహిక ఖగోళ పరిశోధకుడు తన టెలిస్కోపుతో మరో గ్రహాన్ని కనుగొన్నాడు. అదే యురేనస్. అక్కడితో కథ మలుపు తిరిగింది.

1784లో యోవాన్‌బోడ్ యురేనస్ కక్ష్యను నిర్ధారించాడు. కానీ 1788లో చూస్తే యురేనస్ ఆ కక్ష్యలో లేదు. మళ్లీ 1790లో దీని కక్ష్యను నిర్ధారించారు. కానీ కొన్నేళ్ళకు అదీ తప్పని తేలిపోయింది. 1820లో ఇంకోసారి అలెక్సిస్ బోర్డ్ పాత లెక్కల్ని కాదని కొత్త కక్ష్యను నిర్ధారించాడు. కానీ అదేమి చిత్రమో యురేనస్ ఈసారి కూడా తప్పుడు నడకలు సాగించింది. ఇలా కక్ష్యలు మార్చే దాని నడక శాస్త్రజ్ఞులకు కొరకరాని కొయ్యగా మిగిలి పోయింది.

మరి యురేనస్ నిర్ధారిత కక్ష్యలో ఉండకపోవడానికి కారణం ఏమిటి? ఒక్కొక్కరు దీనికి ఒక్కో కారణం చెప్పారు.

సైన్సు ఎలా పుట్టి పెరిగింది?

33