Jump to content

పుట:Science Ela Putti Perigindhi VBS JVV.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాఠాలు చెప్పుకొంటూ, పుస్తకాలు రాసుకొంటూ, వెంటబడి తరుముకొస్తున్న ముష్కర మతఛాందసుల్ని తప్పించుకొంటూ జీవితంలో నాలుగుపదులు వెళ్ళదీశాడు. ఎక్కడా రాజీపడి మాత్రం ఎరగడు.

పాపం బ్రూనో అమాయకుడు. అతని కళ్ళు ఆకాశపుటందాల్ని, సుదూర నక్షత్ర మండలాల కాంతిపుంజాల్ని జుర్రుకోగలవు గానీ సాటి మనిషి కుట్రల్నీ, కుతంత్రాల్నీ పసిగట్టలేవు. 'గురువర్యా నాకు పాఠం చెప్పండి. జ్ఞానదానం చెయ్యండి' అని చేతులు జోడించిన ఒక ఆషాఢభూతి శిష్యుణ్ణి 'గియోవానీ మేసేనిగో'ను నమ్మి, మాతృదేశం మీద మమకారం చంపుకోలేక ఇటలీకి వచ్చి ధర్మం తోలు కప్పుకొన్న తోడేళ్ళ వాతపడ్డాడు. చరిత్రలో ఇదొక భాగం.

★ ★ ★

రోమ్ నిండా ఎక్కడ చూసినా జనం. ఎవరి నోట విన్నా బ్రూనో పేరే. అప్పటికే 30వేల మంది అక్కడికి చేరారు. బ్రూనోకు స్మృత్యంజలి ఘటించడం మొదలైంది. ఛాందస మత నాయకులు పాపం ఆముప్ఫైవేల మందిని సజీవ దహనం చెయ్యలేక కాబోలు తాము ఉపవాసం చేస్తామని 'బెదిరించి' కళ్ళప్పగిస్తూ చూస్తుండిపొయ్యారు. సరిగ్గా 289 ఏళ్ళ పూర్వం చేసిన పాపానికి జనం ప్రాయశ్చిత్తం చేసుకొంటున్నట్టు ఇటలీ జనం బ్రూనోకు నివాళులర్పించి చేతులెత్తి జోహార్లు పలికారు. నాడు బ్రూనో పేరు తారకమంత్రమై ఆబాలగోపాలం నాలుక మీద నాట్యమాడింది.

బ్రూనో శాస్త్రవేత్త కాదు. ఆయనేమీ మహావిష్కారాలు చెయ్యలేదు. గణిత సూత్రాలు రూపొందించలేదు. ప్రయోగశాలల్ని ఆయనెరుగడు. కానీ మానవాళి విముక్తికి బంగారు బాటలు వేసి విజ్ఞానశాస్త్ర వికాసంలో ఆయనకు అజరామరమైన స్థానం లభించింది. ఎందుకని?

బ్రూనో పాతికేళ్ళ వయసులో కోపర్నికస్ గ్రంథాన్ని (On the Revolution of the Heavenly Sphears) చదవడం తటస్థించింది. అప్పటికది ఏమాత్రం ప్రచారం లేని గ్రంథం. కాకుంటే నాటి ఖగోళ శాస్త్రజ్ఞులకు కోపర్నికస్ మరో టోలమీ అంతే. (టోలమీ విశ్వంలోని గోళాలు భూమి చుట్టూ తిరుగుతుంటాయన్నాడు.) మహా అయితే కోపర్నికస్‌ని నమ్మేవాళ్ళు ఓ డజనుమంది ఉంటే గొప్ప ఆ రోజుల్లో. ఛాందసవాదుల చేతిలో గెలీలియోకు పట్టిన గతి అప్పటికింకా ఎవ్వరూ మరిచిపోలేదు. అయినా బ్రూనో సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని నమ్మాడు. దాన్ని ప్రచారం చేశాడు. అందర్నీ ఎదిరించి నిలబడ్డాడు. చివరికి ప్రాణత్యాగమే చేశాడు. సత్యాన్ని ఆవిష్కరించడం కోసం జీవితాల్ని బలిపెట్టిన శాస్త్రజ్ఞులకు ప్రపంచంలో కొదవలేదు. కానీ ఆవిష్కరింపబడ్డ సత్యాన్ని నిలబెట్టాడానికి ప్రాణాల్ని బలిదానం చేసినవాడు బ్రూనో! నమ్మిన సత్యాన్ని వ్యక్తీకరించే స్వేచ్ఛ కోసం ప్రాణాల్చిన వాడు బ్రూనో, శాస్త్రం, స్వేచ్ఛా, బలిదానం ఎంత విడదీయరానివో నెత్తురొడ్డి నిరూపించినవాడు బ్రూనో! అందుకే విజ్ఞానశాస్త్ర ప్రపంచంలో ఆయనకింత గౌరవం.


సైన్సు ఎలా పుట్టి పెరిగింది?

24