Jump to content

పుట:Science Ela Putti Perigindhi VBS JVV.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పరిశీలిస్తున్నాడు. కర్ర ఎత్తుని, నీడ పొడవుని మార్చి మార్చి కొలుస్తున్నాడు.

పిరమిడ్ ఎత్తు కొలవమంటే కర్ర నీడ కొలుస్తాడేమిటి? ఎవ్వరికీ అప్పటికీ అంతు పట్టలేదు. ఎప్పుడైతే కర్రనీడ పొడవు క్రర ఎత్తుకు సమానంగా ఉందో అప్పుడా కుర్రాడు పిరమిడ్ నీడ పొడవును ఆ కర్రతోనే కొలిచాడు. 'ఇదే పిరమిడ్ ఎత్తు' అని తేల్చి చెప్పాడు.

నిజమే మరి. కర్ర ఎత్తు ఎంతో నీడ పొడవూ అంతే అయినపుడు పిరమిడ్ ఎత్తు ఎంతో పిరమిడ్ నీడ పొడవూ అంతే వుంటుంది. ఈ విధంగా ఉదయం నుండి మధ్యాహ్నంలోపు ఒకసారీ, మధ్యాహ్నం నుండి సాయంత్రంలోపు మరోసారి రెండుసార్లు జరుగుతుంది. మన కుర్రాడు రెండుసార్లూ కొలిచి, సరి చూచుకొని పిరమిడ్ ఎత్తును ఖచ్చితంగా చెప్పేశాడు.

ఇంతకూ ఈ 'కుర్రకుంక’ ఎవరనుకొన్నారు? ఆ వయస్సులోనే అప్పటి గ్రీకుదేశపు ఏడుగురు గణిత మేధావుల్లో ఒకడుగా గుర్తింపు పొందిన ఒకానొక విద్యార్థి! థేల్స్! ఇక ఆ రాజుగారి పేరు మీకు తెలిసే ఉంటుంది, అమాసిస్.

ఇంత అద్భుతమైన ఆలోచన 'థేల్స్'కి ఎలా వచ్చింది? అందులోనూ ఓ విచిత్రం ఉంది. ఒకరోజు అతడు ఎండలో నడుస్తున్నాడట. తన నీడను తదేకంగా గమనిస్తున్నాడట. ఒకానొక వేళ తన ఎత్తూ తన నీడ పొడవూ సమానంగా ఉండటం గుర్తించాడట. అలా రోజులో రెండుసార్లు జరుగుతుందనీ అవగతం చేసుకొన్నాడట. ఆ చిన్న ఆలోచనే పిరమిడ్ ఎత్తు కనుగొనేందుకు దోహదపడింది.

మేధావులు గాల్లోంచి పుట్టరు. వాళ్ళు మనలానే పుడతారు. నిత్య జీవితంలో మన కెదురయ్యేవే వాళ్ళకీ ఎదురవుతాయి. కానీ వాళ్ళు చూచే పద్ధతి వేరు. మనం చూచే పద్ధతి వేరు. ఆ పద్ధతే, ఆ జిజ్ఞాసతో కూడిన దృష్టే వాళ్ళని మేధావుల్ని చేస్తుంది.

సరే. ఇంకేం మరి. మన పిల్లగాళ్ళనీ ఊరి మీదికి తరమండి. తాటిచెట్లు, కరెంటు స్తంభాలు, జండా పోల్సు ఒక్కటేమిటి ఎంత ఎత్తయితేనేం కొల్చుకొని రమ్మనండి. కొల్చుకొని వచ్చేస్తారు.

అసలు కర్ర ఎత్తు నీడ పొడవు సమానంగా ఉన్నపుడే ఎందుక్కొలవాలి? మనమైతే ఎపుడైనా కొలవొచ్చు. కర్ర ఎత్తుకు నీడ పొడవు నాలుగవ వంతే ఉందనుకోండి. కరెంటు స్తంభం ఎత్తు దాని నీడకు నాలుగు రెట్లు ఉంటుందని లెక్కించవచ్చు.

చండ్ర శ్రీనివాస్, తురకపల్లె

సైన్సు ఎలా పుట్టి పెరిగింది?

20