పుట:Saundarya-Lahari.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44

సౌందర్యలహరి

టీ. హేధరణిధరరాజన్యతనయే = ఓపార్వతీ, తవ = నీయొక్క, నిమేషోన్మేషాభ్యామ్ = కనులు మూయుటచేతను తెఱచుటచేతను, జగతీ = లోకము, ప్రళయమ్ = నాశమును, ఉదయమ్ = మఱల పుట్టుకను, యాతి = పొందుచున్నది. ఇతి = ఈలాగున, సంతః = యోగులు (దృష్టిసృష్టివాదులగు శ్రీశంకరులు), అహుః = చెప్పుదురు. త్వదున్మేషాత్ = నీకనులు తెఱచుటవలననే, జాతమ్ = పుట్టిన, ఇదమ్ = ఈ, అశేషమ్ = సర్వమగు, జగత్ = లోకమును, ప్రళయతః = ప్రళయమువలన, పరిత్రాతుమ్ = రక్షించుటకొఱకు, తవ = నీయొక్క, దృశః = చూపులు, పరిహృతనిమేషాః-పరిహృత = చాలింపఁబడిన, నిమేషాః = ఱెప్పవాల్పులుగలవి, ఇతి = అని, శఙ్కే = తలఁచెదను.

తా. గట్టుఱేనికూఁతురగు తల్లీ, నీవు కనులుమూయుట తెఱచుటవలన లోకములకు సంహారోత్పత్తులు గలుగునని పెద్ద లనియెదరు. నీవు కనులు తెఱచుటవలన పుట్టిన యీయెల్లప్రపంచమును ప్రళయమున నశింపకుండఁ గాపాడుటకై నీ వెప్పుడు కనులు తెఱచియుందువు. దేవతాసామాన్యమైన యనిమేషత ని ట్లుత్ప్రేక్షించిరి.

తవాపర్ణే కర్ణేజపనయనపైశున్యచకితా
నిలీయన్తే తోయే నియతమనిమేషాశ్శఫరికాః,
ఇయం చ శ్రీర్బద్ధచ్ఛదపుటకవాటం కువలయం
జహాతి ప్రత్యూషే నిశి చ విఘటయ్య ప్రవిశతి. 56

టీ. హేఅపర్ణే = ఓదేవీ (పర్ణభక్షణమునులేక తప మొనర్చినది), తవ = నీయొక్క, కర్ణేజపనయనపైశున్యచకితాః-కర్ణేజప = చెవులచెంతనున్న (కొండెమునుజెప్పు నైజముగల), నయన = కనులచేతనైన, పైశున్య = గుట్టుబయలు పఱచుటవలన, చకితాః = భయమొందినవై, అనిమేషాః = ఱెప్పపాటులులేని, శఫరికాః = చేఁపలు, తోయే = నీటియందు, నిలీయన్తే = దాఁగుచున్నవి, నియతమ్ = నిజము, కించ = మఱియు, ఇయంచశ్రీః = ఈయగపడు నీనేత్రలక్ష్మి, బద్ధచ్ఛదపుటకవాటమ్-బద్ధ = మూయఁబడిన, ఛద = దళములయొక్క, పుట = పొరటలనే, కవాటం = తలుపుగలిగిన, కువలయం = కలువను, ప్రత్యూషే =