పుట:Satya harishchandriiyamu.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంభవించినను క్షమాగుణ సంపత్తిచే సహించుటే కాక తన్ను నొక్కనికిం దెగనమ్ముకొనుట నీచంబని నే సంకోచించునప్పుడు "నాథా! సత్యప్రతిష్ఠకై యొనర్చు నీచ కృత్యంబులు సగౌరవములే యగు" నని నాకు నుత్సాహము కలిగించి నా సత్యదీక్షం గాపాడిన నా యర్థాంగ లక్ష్మి యగు చంద్రమతీ దేవి వియోగదుఃఖము నేనే గతి భరింతు? హా దేవీ! అసూర్యంపశ్యా! నీ రాణివాస సౌఖ్యం బేమయ్యెను? అయ్యో! సాధ్వీమణీ! నీ పతి బ్రతికుండగనే నీవనాథవై యొక్కని దయకుం బాత్రురాలవు గావలసివచ్చె గదా! హా కుమారా! లోహితా! నిన్ను మరల నేనెన్నఁడు జూడఁ గలుగుదు? తండ్రీ! దాసదాసీ జనంబుల చేతులనుండి యడుగటు వెట్టనీక మిగుల గారాబమునఁ బెంచిన నిన్నిట్టి నిష్ఠురతమంబగు దాస్యంబున కొప్పగించితి కదా! అక్కటా! నాదుఃఖమంత కంతకు మితిమీరుచున్నది. కడచిన విపత్తు లొక్కటొక్కటిగఁ దలంపునకు వచ్చి నా ధైర్యమును మరింత మాపుచున్నది. ఆహా! ఆనాఁడు భార్యాపుత్రులం గాలకౌశికునకు విక్రయించునప్పుడు "దాసీ! కదలవేమి!" అని యప్పాఱుడు తన తల్లి నడలించినాఁడని మా లోహితుఁడు "ఓరీ! మా యమ్మ నెక్కడకుగొని గొనిపోయెదవురా!" యని తనపై నదరినాఁడని యా కాలకౌశకుఁడు నిర్దయుడై,

మ. "కుడవం గూటికి లేకపోయినను నీకున్‌ రాజసంబెంత హె
చ్చెడురా! ఛీ! తలకెక్కెనే పొగరు దాసీ పుత్ర" యంచున్‌ సుతున్‌
పడద్రోయన్‌ గొడుకట్టె నా వదనమున్గన్నీళ్ళతో జూచె హా!
కడుపున్‌ ఱంపపుఁ గోఁతఁగోయునదియే గాయంబు గాకుండఁగన్‌.

అయ్యో! అట్టి దురవస్థనుండి సతీసుతులం దప్పింపలేక పోయితిగదా! నాకై గదా, రారాజు బిడ్డయగు నిల్లాలు దిక్కుమాలి పరులకొంపలఁ జాకిరికత్తెయై యల్లాడుట, ఛీ! ఛీ! కఠినాత్మా, హరిశ్చంద్రా! నీ జన్మము నిజముగా నిరర్థకమైనది. చూడు,

సీ. విడలేక నీ వెనువెంట వచ్చెదనన్న
          పౌరుల దుఃఖముల్బాసినావో
సరిరాచబిడ్డయౌ సతిని నిల్లాలిని
          బ్రియ మారంగా సుఖపెట్టినావో
గడుపారఁ గన్న యా గొడుకును ముద్దుగాఁ
          బెంచి ముచ్చటలఁ జెల్లించి నావొ
పుత్రవత్సలత నెప్పుడు నన్నుఁ బ్రేమించు
          కులగురు నాజ్ఞలో మెలఁగినావొ