పుట:Satya harishchandriiyamu.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శా. కాలంపుం గతి నెప్పుడేది యెటు భోగ్యం బప్పుడప్పాటనౌ
నాలీలన్‌ మును సేతు శీతనగ మధ్య ప్రాచ్య సామ్రాజ్య హే
లా లీలానుగతిన్‌ జరించి యిపుడీలాగైన నా ప్రాప్తికిన్‌
నాలో నాకొకభంగి నవ్వగు దురంతంబైన దుఃఖంబుతోన్‌.

మఱియు,

మ. చతురంబోధి పరీత భూవలయ రక్షాదక్ష చామీకరా
యత దండంబు ధరించు నీ కరమె యాహా! యిప్పు డిక్కాటిలో
జితిలోఁ గాలుచునున్న నీ కొఱవి దాల్చెన్‌ నవ్య మాణిక్య రా
జిత నీరాజన కాంతికిన్‌ బదులు వచ్చెన్‌ శోచనీయంబుగన్‌.

అయ్యో! ఈ కొఱవి యిప్పుడే యాఱినది. పోనీ, పాఱవైచెదను. (అని మెల్లగా నడచి) ఓహో! ఇదే శ్మశాన రాజ్యాభిషిక్తుఁడ నగు నా సింహాసనము (అని యెక్కి) నేనిక్కడ సోమరితనమున గూర్చున్న నిదుర వచ్చి స్వామి కార్యంబునకు భంగము కలుగదా, అయ్యో! నాకును నిద్రాహారములకును ఋణముతీఱి యెంతకాలమైనది? సుగుణవతియు నా యర్థాంగ లక్ష్మియు నగు చంద్రమతిఁ గొడుకుతో నొక్కనికి దాసిగా నెప్పుడమ్ముకొంటినో నాఁటితో నాకును నాసౌఖ్యమునకును ఋణము దీఱినది. మొండిపడి ప్రాణము మాత్రము వెడల పోకున్నది. ప్రాణము పోయిన నీ దుఃఖము లన్నియు నెవ్వరనుభవించు వారు? ఆహా! దైవోపహతుఁడనై నేనిప్పుడెన్ని విధముల బాధింపబడుచున్నాను.

మ. అకటా! యొక్కని పంచ దాసియయి యట్లల్లాడు నిల్లాలి పా
ట్లకుఁనై కుందుదునా? సువర్ణమయ డోలాకేళికిం బాసి పొ
ట్టకునై రోసి తపించు నా కొడుకు జాడం గాంచి దుఃఖింతునా?
యిఁక నీ నీచపు గాటికాఁపరిని నాకే నేను శోకింతునా?

హా! హా! లోకములోనిఁ గష్టములన్నియు నన్నే కోరి వరించినట్లున్నవి? కాకున్న నిన్ని కష్టము లెవ్వరనుభవింతురు? అయ్యో! ఈ నిర్భాగ్యపు హరిశ్చంద్రుండు గతించిన వెనుక మరలఁ గష్టములకు దావెక్కడ దొరుకునో. రాజ్య వియోగంబునకై దుఃఖింపను. మహారణ్యావాసాది ఘోరదుఃఖంబులెన్ని సంభవించినను గణింపను. కడకతి నీచంబగు నా యీ చండాల దాస్యంబునకు గూడఁ బరితపించను. కాని చేపట్టినదాది నన్నే పరమ దైవంబుగ భావించుచు నా మూలమునఁ దనకంతలేసి కష్టములు