పుట:Satya harishchandriiyamu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కేశ - అమ్మా! మేమే పాపకర్మ మెఱుఁగము. మేమందఱ మడవిలో దర్భలు గోయుచుండ "మిత్రులారా! నన్నొక పెనుఁబాము కఱచినది" యను మీ లోహితాస్యుని దీనారవము మాకు వినంబడినది. అంత మేము పోయి చూతుము గదా సర్పదష్టుడై మరణవేదనఁ బడుచున్న నీ కుమారునిం జూచితిమి.

చంద్ర - హా! తండ్రీ! లోహితా! నే జచ్చితినిరా. (మూర్ఛిల్లును)

కేశ - అమ్మా! ఇంకఁ గొంచెము చెప్పవలసియున్నది.

చంద్ర - నాయనా! ఇంకేమి చెప్పవలయును?

కేశ - అప్పుడు స్పష్టముగా లేని వాక్కులతో నిట్లు చెప్పినాడు.

చంద్ర - ఎట్లు తండ్రీ!

కేశ - ('జాగయ్యె' నను పద్యమును చదువును) అట్లు చెప్పినప్పుడు మరణవేదన పడుచుండె. ఇప్పుడెట్లుండునో తెలియదు. ఎట్లయిన నీ కుమారుని నొక్కమాఱు చూచుకొనిరమ్ము. ఇదిగో ఈ మార్గమున సూటిగాఁ బోయితివేని నీ కొక వటవృక్షము గాన్పించును. దాని నీడయందే నీ నందనుండు పడియుండు. మేమింకఁ బోయి వత్తుము. మాకచట మాట వచ్చును.

చంద్ర - అయ్యలారా! పొండు. నా దురదృష్టమునకు మీరేమి చేయుదురు?

(బ్రహ్మచారులు నిష్క్రమింతురు)

చంద్ర - హా! కుమారా! లోహితా! నీకు మృత్యుదేవతయై యాకాలసర్పమెక్కడ దాపురించెనోయీ తండ్రీ! అడవికేగునప్పుడు "నేను నడువలేకున్నను నన్ను గురుండు బలవంతముగా గొట్టుచుఁ బొమ్మను చున్నాఁ" డని నీ వెంత చెప్పికొన్న నింటనే నిల్పికొనఁ జాలని నేను నిన్నుఁ జూడ వచ్చుటకు మాత్రమెట్లు స్వతంత్రురాలనగుదును? కొడుకా! నీవునన్నుఁ బూర్ణముగా విడిచిపెట్టితివా? హా విధీ! పతివియోగముచేతనే యిదివరకు గృశించి కృశించి యెప్పటికైన మా హరిశ్చంద్రుని చూడకపోదునా? యెల్లకాలము గష్టము లిట్లే యుండునా యను మొండి ధైర్యముచే నెక్కడనో యొక్క ప్రాణముతోడ నీలాగు జీవించియున్న నాగర్భమునఁ బుత్ర వియోగాగ్నియుఁ దరికొల్పితివా? నాకింక దిక్కెవ్వరు? హా! ప్రాణేశ్వరా! హరిశ్చంద్రా! నీ విప్పుడెక్కడ నున్నావు? కాలవైపరీత్యముచే నీకుటుంబ మంతయు దిక్కుమాలి నేఁటికి జెట్టున కొక పక్షియై రాలిపోవలసి వచ్చెనే, అయ్యో! దుఃఖభారముచే సేవాకృత్యమును మఱచుచున్నాను. స్వామి యాజ్ఞంగైకొని కొడుకువడియున్న చోటునకైనబోయి చూచివచ్చెదను. అమ్మా! కాలకంటకీ! నీవిప్పుడేమందువో?

కాలకం - (ప్రవేశించి, కోపముతో) ఓసీ, అంసనారీ! నీ విల్లు కదలి ఎంతసేపైనదే? పిడక లేరుకొని రమ్మని పంపగా సుఖముగా నిక్కడఁ బ్రొద్దులు పుచ్చుచున్నావా?