పుట:Satya harishchandriiyamu.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాని వడుగులతోఁ గలసి యడవి కేగిన మా లోహితాస్యుం డింకను రాకున్నాఁ డేమొకో? రావలసిన వేళ గూడ యతిక్రమించుచున్నది. అదిగో,

శా. ఆవు ల్మందలలోన నిల్వకయె యంబాయంచు లేదూడలన్‌
ద్రావింపన్‌ దమచేఁపు బాలు వడి నిండ్లన్‌ జేరెడిన్‌ ముక్కలం
దేవో ధాన్యపుఁ గంకు లందికొని యప్డే గూండ్లకున్‌ జేరెనా
రావంబు ల్చెలంగన్‌ బులుంగు లకటా! రాడేఁమి నా పాపఁడే.

నేఁ డేకారణంబుననో నామనంబు పరిపరివిధముల దపించుచుఁ గీడునే శంకించు చున్నది. తొలుతఁ కుఱ్ఱవానిని స్వామి యడవికిఁ బంపునప్పుడు బాల్యచాపల్యముచే వాఁడు "నే నడవికిం బోలే" నన్నమాత్రమున ముక్కోపియైన కాలకౌశికుఁడు చబుకుం బట్టుకొని,

మ. "చెడుగాఁ యేపని చేతగానియెడ నాచే నౌనె ముప్పూటలున్‌
గడుపుబ్బ న్నిను మేప?" నంచుఁ దనువున్‌ గాయాలుగాఁ గొట్టినన్‌
బడలేకా వ్యధఁ బ్రాణభీతి "గనుడమ్మా! చూడవే" యంచు నా
కడకేతెంచిన పుత్రు కష్టగతి నా గర్భంబు ఛేదించెడిన్‌.

దైవమా! ఎంత నీచ దురవస్థకుం దెచ్చితివి. ఏది యెట్లయినను గుఱ్ఱవాఁ డింకను నాకంట బడలేదు కదా! చెడుదినములుగాన నామనంబు ప్రతిక్షణము శంకించుచునే యున్నది. (ప్రక్క జూచి) వారే వడుగులందఱు వచ్చుచున్నారు. అక్కటా! కోసిన దర్భలు మోయలేక కుఱ్ఱవాడు వెనుకం జిక్కె కాఁబోలు! నేను వానికి సహాయము పోయెదను. (ఎదురుపోయి) ఏఁడి నా లోహితుఁడు? బ్రహ్మచారులు మాత్రము గనపడుచున్నారు గాని నా ముద్దులయ్య లోహితుండు కనంబడఁడే?

(వడుగులు ప్రవేశింతురు)

కేశ - జనార్దనా! పాపము చంద్రమతి ఇక్కడనే యున్నదిరా?

జనా - అయ్యో! ఈ దారుణవార్త యేమని వచింతుము?

చంద్ర - అన్నలారా! మా లోహితుఁడెక్కడ?

బ్రహ్మచారులు - (ఊరకుందురు.)

చంద్ర - ఏమి నాయనలారా? మాటాడరు? మఱేమి యప్రియము లేదు కదా?

కేశ - జనార్దనా! చెప్పుము.

జనా - నీవే చెప్పరా.

చంద్ర - అయ్యలారా! మిమ్ముఁ జూచిన నా కడుపు బ్రద్దలగుచున్నది. మీ ప్రియ మిత్రుడు లోహితాస్యు డేమయ్యెనయ్యా!