పుట:Satya harishchandriiyamu.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కంటే నేనే ఎక్కువ దర్భలను గోసెదను. (పుట్టనెక్కి కోయుచుండ పాము కఱచును) హా! తల్లీ! హా! మిత్రులారా! నన్నొక పెనుఁబాము కఱచినది. (పడిపోవును).

అందఱు - (పరుగెత్తుకొనివచ్చి) నెచ్చెలీ! నీకేమైనది?

లోహి - అన్నలారా! ఇంకేమి కావలయును? నన్నొక పాము కఱచినది. ఇంక మాయమ్మను జూచుభాగ్యము నాకు లేదు.

కేశ - అయ్యో! అయ్యో! నీకెంత కష్టము కలిగెను? జనార్దనా! పాపము వీనికి మత్తు వచ్చుచున్నది. చెమటలు శరీరమునుండి యూఱక కాఱుచున్నవి. నోట నుఱుగులు పడుచున్నవి. కొంతసడి విసరనైన విసరుదము. (అట్లే చేయుచుండ)

లోహి - (కొంచెము తేఱి) అన్నలారా! చింతింపకుడు. నా యదృష్టమునకు మీరేమి చేయగలరు? మీ రిక్కడ నా మూలమున మసలవద్దు. మీకు మాట వచ్చును.

సీ. జాగయ్యెనని కొట్టునో గురుండట మిమ్ము
          నిచట నుండక యింటి కేగరయ్య
అతిభక్తి మీకు లోహితుఁడంపినాడని
          యీ కుశల్గురున కందీయరయ్య
సదయయై నారాక కెదురు చూచెడి తల్లి
          కీ నాదుగతి వచియింపరయ్య
యేదిక్కు లేక నేనే లోకమని యున్న
          జనని దుఃఖము బాపి మనుపరయ్య

   వీలుగా నున్న గురు నొప్పుకోలుమీఁద
          నమ్మ నొకసారి చూచి పొమ్మందురయ్య
          విసము తలకెక్కె నేను జీవింపనయ్య
          కడ కిదే మీకు నా నమస్కారమయ్య!

నెచ్చెలులారా! నా ప్రాణములు లేచిపోవుచున్నవి. మీరిఁక బొండు. హా తల్లీ! నీవైన నాదగ్గర లేకుంటివే? (మూర్ఛిల్లును)

జనా - అయ్యో! అయ్యో! ఎంతపని జరిగెను?

కేశ - మనమీఁద కేమి రాదుకద జనార్దనా!

జనా - మనము పోయి పాపమా చంద్రమతి కీ సంగతి నెఱింగింతము. మనమిక్కడ నుండి చేయునదేమున్నది? (నిష్క్రమింతురు)