పుట:Satya harishchandriiyamu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీ కన్నుంగవ దుమ్ముసల్లి యిట మున్నే రాజ్య సర్వస్వముం
జేకొన్నా డిఁక నేటి యప్పు? నిజముం జింతింప నింతేకదా!

హరి - ఇంతియెకాని ' నెలదినములలో నిచ్చెద ' నని యమ్మునితో నొప్పు కొంటిని గదా?

నక్ష - లేదనిన నామాట లన్నియు సున్న యగుంగాదే?

హరి - అయ్యా! సత్యేతరంబునకు నామానసం బొప్పునయ్యా!

నక్ష - అయ్యో! అమాయకుడా! ఇంతలోఁ జెడ్డప్పుడుగూడ సత్యము సత్య మని యూఁగులాడు చున్నావే? హరిశ్చంద్రా! నీ వేమనుకొన్నను,

మ. జటినై నేననరాదు కాని విను నీ సత్యంబె నీ కొంప కిం
తటి చేటౌటకు మూల; మిప్పటికి నైనన్‌ మించిపోలేదు, తీ
ర్చుట కేనాటి ఋణంబు మీ కనిన దీఱున్నీకు మా బాధ; యం
తట నూరేగుము సత్తుచి త్తనుచు జింతన్‌ బాసి బైరాగివై;

అట్లుకానిచో నింత ధనము నీ విప్పట్టున నె ట్లార్జించెదవు? చెప్పుము.

సీ. వైదికవృత్తి సంపాదింతు నంటివా
          యుడుగవు రాచపోకడలు నీకు,
రాచఱికంపు శౌర్యమున దెత్తు వఁటన్న
          దెసమాలి యేవంక దిక్కు లేదు,
వణిజు వర్తనముచే గణియింతు నంటివా
          యరచేత గుడ్డిగవ్వైన లేదు,
వ్యవసాయవృత్తిచే సవరింతు నంటివా
          లేదు భూవసతి గోష్పాదమంత,

గీ. ఇందు నేదేని వ్యాపార మందదగిన
యంత పున్నెంబు పుట్టిన నింతధనము
గంటుకట్టుదె యీ స్వల్ప కాలమునను
గడచు నీ నాటితోడ మా గడువుదినము.

ఇవి యేవియుగాక బానిసవృత్తికి బాల్పడినను ని న్నెవరు కొనువారు లేరు. కావున నా యుపదేశవాక్యముల ననుసరించి నీ వీ ఋణబాధ తప్పించికొనుము. మా గురువుగారితో నీ దురవస్థయంతయు జెప్పి యీ సొమ్ము వదిలివేయు తెఱంగొనరించెద. చెప్పుము. ఏల నీకీ బాధ?