పుట:Satya harishchandriiyamu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

సత్య హరిశ్చంద్రీయము

ద్వితీయాంకము

(ఆలోచన మభినయించుచు విశ్వామిత్రుడు ప్రవేశించుచున్నాడు)

దుర్ఘటమైన కార్యము పై వేసికొన్నందుల కనివార్యంబుగా దాని నిర్వహింపవలయును. ఇందు నాకు జయమా పరాజయమా యని ముందు యోజించెద. (ఆలోచించి) హరిశ్చంద్రుండు నా మాయాజాలంబుల బడక యబద్ధమాడకున్నను సాటి రాచపట్టి సత్యకీర్తి ప్రపంచస్థాయిగా నిలుప గారణమైతి నను సంతసంచే నాకు జయం బగు. బొంకెనా వసిష్ఠున కున్నంత సంకటము నాకు లేదు. అయినను (గర్వముతో) విశ్వామిత్రుడ నగు నాకు గూడ నపజయ భయమేటికి?

మ|| క్రతుభుక్సంతతితోడ బోరి, సురలోకం బొండు గల్పించి, ది
వ్యతపశ్శక్తి ద్రిశంకు నం దునిచె నే భ్యవ్యుండు, ప్రాక్సష్టికిన్
బ్రతిసృష్టిం ఘటియించి బ్రహ్మపద మే రాజర్షి సాధించె, న
ట్టితపోరాశి తలంప వాని కవె వాటిల్లున్ జయారంభముల్.

కావున నే నిప్పుడు హరిశ్చంద్రుని యాస్థానమునకే పోయెదను. (గర్వముతో నిష్క్రమించుచున్నాడు.)

ఇది విష్కంభము.