పుట:Satya harishchandriiyamu.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్త్రీ హత్యకు గూడఁ బాల్పడితివిగా? దుర్మార్గుడా! సమంచిత సాధ్వీమతల్లి యగు నీ యిల్లాలి జంపి నీవింకనే స్వర్గరాజ్యం బేలదలచితివి? ఇప్పటికైన నా మాటవిని సౌందర్యసీమలగు నా ముద్దు కూఁతులం బరిణయమాడుము. నీ దారపుత్రుల ప్రాణదానంబును, రాజ్య ప్రదానంబును ననుగ్రహించెద. వినుము, నా వాక్కులమృతముతో సమానములు సుమీ.

హరి - (నవ్వి) గాధేయా! ఈ నీతులు నాకవసరము లేదు గాని మీరింక నిక్కడ తొలగిపొండు. నా పూనిక మాన్పనింక మీ తరము కాదు. పొండు. పొండు.

విశ్వా - కానీ. నీ వనుభవించెదవు. (స్వగతము) నేనిప్పుడేమి సేయుదును?

హరి - దేవీ! సిద్ధముగా నుండుము.

విశ్వా - (తత్తరముతో) హరిశ్చంద్రా! ఈ పాటికి శాంతింపుము. నీ గురువే జయించెను, నేనే యోడితిని.

హరి - అయ్యా! మీ మాటలు నా కర్థము కావు. గురువేమో, జయమేమో నేనెఱుగను. పొండావలకు.

విశ్వా - (దిక్కులకుం బరిగెత్తుచు) నక్షత్రకా! నేనిప్పుడేమి సేయుదునురా? ఓ దేవేంద్రా, మీరైన హరిశ్చంద్రుని వారింపుడు. హరిశ్చంద్రా! శాంతింపుము.

శా. సత్యశ్రీనిధివైతి! నీగురు ప్రతిజ్ఞావాక్యము ల్సెల్లె! స్త్రీ
హత్యాదోషము గట్టుకోకు! మిపు డార్యాభర్త విశ్వేశుడే
ప్రత్యక్షంబగు నీదు దేశికునితోఁ బాలింపుమా నన్ను బ్రా
ణత్యాగం బొనరింతు లేనియెడ నన్యాయంబుగా నీకునై.

(మరల దిక్కులకు బరుగెత్తి)

 
శా. నేరంబుల్‌ దిగమ్రింగి కాళ్ళఁ బడినన్‌ వేధింతువేమి వసి
ష్ఠా! రా యిప్పుడు పెండ్లి వారి నడక ల్సాగింపకయ్యా! మహేం
ద్రా! రాజిప్పటికే తెగించి తన కార్యం బెల్ల నెగ్గించె నే
మో? రారండికఁ జచ్చు దాక బిగియుంపుల్గూడ నెవ్వారికిన్‌.

ఓ కాశీ విశ్వనాథా! నీవైన నీ రాజేంద్రుని వారింపుము.

(పార్వతీ సహితుడై పరమేశ్వరు డింద్ర వసిష్ఠులతో బ్రవేశించును)