పుట:Satya harishchandriiyamu.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హరి - (ఆకర్ణించి) రాజభటులిక్కడికే వచ్చుచున్నారే!

భటు - (ప్రవేశించి) ఓయీ, వీరదాస! రాజు నాన మేరకీ బాల హంత్రిని దలనఱక మీ వీరబాహు నీ కుత్తర మిచ్చినాడు. ఇదిగో నాతని యానవాలు. దీని నింక దల నఱకుము.

హరి - (స్వగతము) ఏమిది? నా కన్నుల కేమైన భ్రమ కల్గెనా? నిక్కువముగానే చంద్రమతిని జూచు చున్నానా? ఈ శిశుహంత్రి చంద్రమతియా? (ప్రకాశముగా) అయ్యలారా! మీరు నేరస్థాపనయందుఁ బొరపాటు పడలేదు గద? తిన్నగ నాలోచింపుడు.

భటు - ఏమోయీ! మహారాజుగారి యాజ్ఞకే యెదురు చెప్పుచున్నావు? నీకీ యధిక ప్రసంగ మెందులకు? వెంటనే రాజాజ్ఞ నిర్వర్తించుము. మేఁమిఁక బోవుచున్నాము.

(నిష్క్రమింతురు)

హరి - (చంద్రమతిని సమీపించి దుఃఖముతో)

శా. హా కాంతా! జగదేక పావనివి యీ యన్యాయపు న్నిందనీ
కా కల్పించుట? రాజు నిర్దయుడె యోగ్యాయోగ్యముల్సూడఁడే?
లోకంబంతయు నస్తమించెనె? దయా ళుండైన దేవుండు లేఁ
డే కాపాడఁగ? గర్మసాక్షి పయిలేడే సర్వముం జూడఁడే?

చంద్ర - నాథా! దుఃఖింపకుఁడు. దైవము లేకేమి? పూర్వజన్మ సంచిత పాపఫలంబున నిజమో యబద్ధమో కాశీపురాధీశ్వరునిచే శాశ్వతమైన యీలాటి నింద యారోపింపబడి స్వచ్ఛమైన నీ కులంబున కెల్ల నొక కళంకంబు దెచ్చిన పాపాత్మురాలనైతి.

హరి - ఏమీ! జగదేకపావని వగు నీ యందే యొక నీచుఁడు నిందారోపణ మొనరించెనా? ఎట్లు?

చంద్ర - నాథా! అవధరింపుము. అట్లు మీచే సెలవందికొని పోవుచుండగా వొక బాలశవము నా కాలికి దగిలెను. అంత మతి చలించిన దానినై యా కళేబరము మన లోహితునదేమో నని పరీక్షించుచుండ యమకింకరులంబోలిన రాజభటుల చ్చోటికి వచ్చి "ఓసి పాపాత్మురాలా! రాచబిడ్డనేల చంపితి" వని నగలమూట నొకదానిని నాయొడిం బడవైచి దొంగచిక్కెనని నన్ను దన్నుచు రాజసాన్నిధ్యంబునకుం గొంపోవ నతం డతికుపిత మనస్కుండై నా తల నఱుకుమని యాజ్ఞాపించె, ఇదియే నా నిందకుఁ గారణము.

హరి - అకటకటా! ధర్మమున నేఁటికెంతటి దుస్థితి సంభవించినది. తన చిత్తంబు మెప్పింపవలయునని సేవకు లెవ్వరి పైననో నేరమారోపించి తన యెదుట నిల్పినతోడనే న్యాయాన్యాయములు విచారింపకుండ నిరపరాధులఁ గూడ సాపరాధులఁ జేసి, శిక్షించుచుండిన యీలాటి రాజులుండిన నేమి? మండిన నేమి? దేవీ, చంద్రమతీ! నేఁటితో మన యాశాబంధము గూడ దీరిపోయినది. నేనింక నా స్వామి యాజ్ఞ నెఱవేర్పక