పుట:Satya harishchandriiyamu.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ము? అకటకటా! దురవలోక్యంబగు నీ ప్రేతాలయంచే నీ కయోధ్యాపురం బయ్యెనే? కఱకుఁ గలిగిన నులకత్రాళ్ళచే నల్లబడిన యీ మంచెయే నీకు నవరత్న సింహాసనం బయ్యెనా? భయంకరంబులగు నీ భూతభేతాళ పిశాచ గణంబులా నీకు భట సముదాయము? శవనికరంబుల దహించుచుండిన సొదగుంపా నీకు చరదీపికా సహస్రములు? నాథా! నీ రాజసం బెందుఁ బోయినది? నీ తేజంబెందు దాగినది? జీవితేశ్వరా! అశ్రాంతంబు పాదాక్రాంతులై నమస్కరించు సామంతులెల్ల నీ కిప్పుడేల యడుగులకు మడుగు లొత్త కుండిరి! కరపల్లవంబుల బంగారు పళ్ళెరంబుల బట్టి పురంధ్రీ జనంబు నీకేల నీరాజనంబుల నెత్తకుండె! నీ సత్యసంభాషామనీషం గుఱించి ప్రబంధముల నుడువు వందిమాగధ జనంబెందు బోయె! రాజచూడామణీ!

సీ. పసిఁడిమేడలలోన వసియించు ప్రభునకా
           కటకటా! యీ వల్లకాటి వసతి
కనుసన్న దొరలచేఁ బనులందికొను మీక
          యీ నికృష్టపు మాలవాని సేవ!
అలరుఁ దేనియలతో నారగించెడు మీకా
          యకట! శవాల పిండాశనంబు
జిలుగు బంగారు దుస్తుల ధరించెడు మీక
          పొలుసు కంపొలయు నీ బొంతకోక!

   కనుల మీ యిట్టి దుస్థితిం గనిన నాకుఁ
         జావురాకున్న దెంతని సంతసింతు!
         హా హరిశ్చంద్ర! సార విద్యాఫణీంద్ర
         బుధజన మనశ్చకోర సంపూర్ణచంద్ర!

ప్రాణేశ్వరా! మన విపత్పరంపరకే నాఁటి కంతము లేక పోయెనే? నన్ను విక్రయించుటచే విశ్వామిత్రుని ఋణబాధ నిరవశేషముగాఁ దొలంగి యెక్కడనో మీరు కొంత సుఖముగా నున్నారని దలంచితిఁ గాని నాకు సంభవించిన దాస్యమున కంటె వేయిమడుంగు లెక్కుడు నీచంబగు నీచండాల సేవావృత్తియందుఁ జిక్కియున్న మీ కడకుఁ జనిపోయిన లోహితాస్యుని కళేబరముతో నిటుల వచ్చెదనని యొక్క నాఁడు దలంపనైతినే? నృపసార్వభౌమా! ధైర్యము వహించి యొక్క మాటైన నాడుము.

హరి - ఏమీ! నీవు చంద్రమతివా? అయ్యో! వీఁడు నా కొడుకు లోహితాస్యుఁడా! (కుమారునెత్తుకొని)