పుట:Satya harishchandriiyamu.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చంద్ర - అకటకటా! ఎంతటి కాని కాలము సంభవించినది. విశ్వవిశ్వంభరా చక్రంబున కెల్ల నేకచ్ఛత్రాధిపత్యము వహించి యశ్రాంతంబు పాదాక్రాంతులైన సామంత భూకాంతులకోటీర మణిఘృణీరావంబులచే విరాజిల్లు పాదయుగళముల చక్రవర్తికిఁ గుమారుడై కడకీ కాటిలోఁ జేరెడు నేలకేని స్వతంత్రుఁడగుటకు నోఁచుకొనక పోయెనుగా! కొడుకా! నీ ప్రారబ్ధంబున కెంతని విలపింతు?

హరి - (స్వగతము) ఈ బాలుండెవ్వడో మహారాజు కుమారుండని విస్పష్టమైనది. నేనింక నేమని తలంపను? వీడు నిశ్చయముగా మా లోహితాస్యుడేమో? నిస్సంశయుగాఁ బేరు తెలియకయే నే నేల కీడునే యూహింప వలయును? తండ్రీ! లోహితాస్యా! నీకు దీర్ఘాయురారోగ్యములు గలుగుగాక! వీఁడెవ్వ డైన నేమి? నా విధి యందు నేనొక విధముగాఁ బ్రవర్తింప రాదుగదా! (ప్రకాశముగా) ఓ కాంతా! నీవెంత యేడ్చినను నేను గరుణింప జాలను. నీ యుదంతం బంతయుఁ గడు నద్భుతముగ నున్నది. చనిపోయిన వీఁడు రాజకుమారుఁడైనట్లు నీ యేడుపు వలనఁ దెలియవచ్చినది. నిజముగా నీవు రాచదేవేరివేయైనచో మా కీయవలసిన కాటిసుంకము నీకడ లేకుండునా!

చంద్ర - అయ్యో! కాలవైపరీత్యమున నుత్తమ పదవిం బాసి యిప్పుడే నేను శరీర మాత్రవిభవనై యున్నానని యిదివఱకే విన్నవించుకొంటినే, నీ కేల దయరాదు?

హరి - నేనిది బొత్తిగా నమ్మను. నీ కిప్పుడున్న విభవము శరీరమాత్రమే కాదు. ఆలోచించుకొనుము. చంద్ర: అయ్యో! ఇంకేమున్నది?

హరి - ఏమీ! ఇంకేమీ లేదా? చూడు,

 
మ. దళమౌ పయ్యెదలో నడంగియు సముద్యత్కాంతు లీరెండలన్‌
మలియింపన్‌ దిశలన్‌ ద్వదీయ గళసీమన్‌ బాలసూర్యప్రభా
కలితంబై వెలుగొందుచున్నదది మాంగల్యంబు కాఁబోలు! నే
వెలకైనం దెగనమ్మి నీ సుతునకై వెచ్చించినన్‌ జెల్లదే?

చంద్ర - (ఉలికిపడి) అయ్యో! దైవమా! రెండవ సురజ్యేష్ఠుండగు వసిష్ఠ మహర్షి ప్రభావంబుచే నా పతికి దక్క నన్యులకు గోచరంబు కాని నా మంగళసూత్రం బొక్క చండాలుని కంటఁ బడెనా! కాదు కా దీతఁడు నా పతి హరిశ్చంద్రుడే. (అని కౌగిలించుకొని) హా! జీవితేశ్వరా! హా! విశ్వంభరాఖండ రాజ్య ప్రదాన సందర్పిత కౌశికా! హా! వసిష్ఠ ప్రియశిష్యా! హా! సార్వభౌమలలామా! హా! సత్యప్రియా! హా! హరిశ్చంద్రా! నేనే మంద భాగ్యురాలనగు నీ జీవితేశ్వరిని, చంద్రమతిని. ఎల్లప్పుడల్లారు ముద్దుగా బెంచిన నీ వంశాంకురంబగు నీ కుమారుడు లోహితాస్యుఁడీ కాటిలో గులకరాలపై నెట్లు పండుకొని యున్నాడో యొక్కమాఱు కన్నెత్తి చూడుము. ప్రాణపతీ! రాజరాజకోటీరమణి మంజరిమంజరిత పాదాంభోజుఁడగు నీకా యీ కాటికాపరితన