పుట:Satya harishchandriiyamu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాసంత మెఱపించి మోసగించెదవేల
          తోడురావమ్మ విద్యుల్లతాంగి
జలదపుఁ దెరఁబాసి వెలికి రండొక్కింత
          తారలారా! నా కుమారుఁ జూప

   కానవా వాని గంగాభవాని? సుంత
          గోల చాలించి వినుము నా గోడు కొంత
          వేగ గాన్పింపుమయ్య యో విశ్వనాథ!
          నీ కుమారునిఁ బోలిన నా కుమారు.

అయ్యో! గతిచాలనివేళ నా మాట నెవ్వరు పాటింతురు? హా! సుతా, లోహితా! నీవెక్కడ నున్నావు, తండ్రీ! మునికుల పవిత్రా, గాధిపుత్రా! మమ్మెంతయైన సాధింపుము. ఒక్కమాఱు నా కుమారుని జూచుకొన నిమ్ము. (నడచుచు) ఏమిటి? కాలికి నేదియో మెత్తని వస్తువు తగిలినది. నా కుమారుని శరీరము కాదుకదా? (పరికించి) హా! లోహితాస్యా! నీ కెంతటి యవస్థ సంభవించెనురా? కొడుకా! పలుకవేమి? అయ్యో! ఇంతటి కంటకములచేత నిదివఱకె నొత్తుకొనుచున్న నీ మృదుశరీరము కఠినం బగు నా పాదతాడనంబు చేత నింకెంత బాధపడుచుండెనో తనయా! పుట్టిన దాది, యే కష్టము లెఱుంగని నిన్ను గురుండ డవికి బంపుచుండగా నూఱకుంటినని నాపై నలిగితివా? లేకున్న నా తోడ నీ వేల మాట్లాడవు? నాయనా! శరత్కాల పూర్ణిమా రాకా నిశాకర బింబంబు విడంబించు నీ ముద్దు మోము చిఱునవ్వు వెన్నెలచే నలరారుచుండఁ గనులార జూడకున్నను నమృత రసంబునకే లభింపరాని మాధుర్యంబుఁ జిలుక నీ ముద్దు పలుకులు చెవులార వినకున్న బ్రతుకున కింకేమి యున్నది తండ్రీ? నేనింకెవ్వరినిఁ జూచి పుడమిపై జీవించి యుందును, నాకింకెవరు దిక్కు? రాజ్యసుఖాద్యుత్తమ భోగంబులను బాసి చేసికొని పతికి దూరస్థురాలనై యొక్కయింట నూడిగంపుగత్తెనై కాలము గడుపు నీచస్థితికి వచ్చినను గడుపునఁ బుట్టిన కుమారుఁడవు, సకల లక్షణలక్షితాకారుండవు, వంశైక విస్తారుఁడవు, నీ వొక్కఁడవు గట్టిగా నున్నాఁడ వంతియే చాలునని ప్రాణములన్నియు నీ మీఁదనే నెలకొల్పి బ్రతుకు చున్న నన్నిప్పుడే సముద్రమునఁ ద్రోసి బోయెదవు. తండ్రీ! దాసదాసీ జనము లూఁపు బంగారు తూగు టుయ్యెలలపై సుఖ నిద్రంజెందు సౌఖ్యమప్పుడే యంతరించినను నీకు నా కాలకౌశికుని యింటఁ బండుకొనుటకు నాపైట కొంగైన నింత యాధారము దొరకుచుండునే! నేడేదియు లేక దట్టముగా యుండుటచే నిండియుండిన యీ నట్టడవిలో నీ యర్ధరాత్రమున నిట్లొంటి నిద్రించుచుంటి వేమోయీ? కొడుకా! లోహితా! నీకు నేటికి