పుట:Sasi Kala, Adavi Bapiraju.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

111

శశికళ

సత్తువంతా పోయి అందపు
మత్తులో పడిపోయి, హృదయము
ఎత్తు పల్లములోన వణికెను,
                చిత్తమున వై రాశ్యమొదవెన్.

తీగెలను స్పందించు విల్లును
రాగ స్వరముల నాడు వేళ్లూ
తూగిపోయే గీతికాతతి
               దోగులాడెను దెసలు దెసలన్నీ !

కోయిలలు పాడేనొ వాగులు
లోయలో నృత్యాలు సలిపెనొ !
వేయి మలయానిలము లొకటై
               వీచెనో శ్రుతులు శ్రుతులన్నీ !

కోటి పూవులు విరిసినట్లై
కోటి చంద్రిక లలమినట్లై
పాటలే ప్రసరించు బ్రతుకున
                బ్రతుకు కదలక శిల్పమై నిలిచెన్.

ఏదియో అమృతాప్లావితమై
ఏదియో ఆనందలీలై
వేదనారహితంపు బ్రతుకై
                రోదసీ పధమెల్ల నిండితి
                హ్లాదమే విశ్వమై నిలిచెన్.