పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ అంకము


శ్రీధర:-అమ్మా! అమ్మా!! ఇదిసరియైన అభిప్రాయముగాదు. పరమాత్ముని ఉద్దేశమును కనిపెట్టుటకు మనకు సాధ్యమా?

లీల:-ఉద్దేశము తెల్లముగానే యున్నది. దుష్టులను ద్రవ్యమిచ్చుట, శిష్టులను శిక్షవేయుట: అబద్దమాడువారి కైశ్వర్యమిచ్చుట, న్యాయప్రవర్తకులను దారిద్ర్యపునూతిలో పడవైచుట; వంచకులను వైభవములిచ్చుట, మంచి వారలను కస్టములో ముంచి వేయుట, అందరికిని తెలిసిన విషయమే!

శ్రీధర:- అమ్మా!

    "పరిత్రాణాయసాధూనాం
    వినాశాయాచదుష్కృతాం,
    ధర్మసంస్ధాపనార్ధాయ,
    సంభవామి యుగేయుగే"

ఇదిమీకుతెలిసిన గీతావాక్యమేగదా;

లీల:-తెలియునుగాని, ఇట్టివి జరుగుట యుగమున కొక్కతూరి, అదియుగాక, ఏదుష్టులను పరిమార్చినాడు? కొంచెము లెక్కవేయుడు. హిరణ్యాక్ష, హిరణ్యకసపులు దుర్మార్గులా? దుష్ట పరిపాలనము చేయు చుండిరా? బలి చక్రవర్తి అధార్మికుడా? రావణుడు దుష్టుడా? చక్కగా విచారింపుడు. తన్ను తిరస్కరించిన వారిని, తనభార్యను, బంధు మిత్రులను బాధించిన వారిని. సంహరించుటకు సంభవించి యుండెనుగాని, ఇప్పటి కాలములో అవతరించుటకు అవకాశమేలేదు. ఎందుకనగ, దుర్మార్గు లందరును దేవునకు టెంకాయలు కొట్టుచు లంచమిచ్చుచునే యుందురు. ఇది ఇట్లుండనిండు. మాతల్లిగారికి అనారోగ్యకరమని వింటిని,ఎట్లున్నది?

శ్రీధర:-బాగుగలేదమ్మ! త్వరలో ఈశ్వరుని పాదారవిందములచేరు నేమొ?

లీల:-ఎంతకష్టము? అయిన తార ప్రసవమునకు ఎట్టి ఏర్పాట్లుచేయుదురు?


శ్రీధర:- అమ్మా! నాకేమితోచదు. సముద్రమధ్యమున చిక్కినట్లున్నాను. కరుణా సముద్రుడే నను గాపాడునుగాక.

44