పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదటి యంకము

తార:- అయితే నన్నేమి చేయమనియెదవు?

భీమ:- నేను మరల చెప్పవలయునా? నీవు తప్పక ఔషధము తీసుకొనవలయును.

తార:- (బదులుచెప్పక దు:ఖించుచు నిలుచును.)

భీమ:- ఎందుకు నీవేడ్చదవు? ప్రపంచమునందిట్టి వెన్నియో జరుగుచున్నవి. ఇట్టి విషయములన్నియు రహస్యముగా సవరణ చేసికొనకపోయిన, ఈకాలములో ఆచారము బ్రాహ్మణ్యమునెట్లు కాపాడవలయును? ఏడ్వకుము మందు తెప్పింతునా?

తార:- అయ్యో? నావలనగాదు. నన్ను ఎచ్చటికైనను పంపివేయరాదా? ఏదైన నొక మిషనాస్పత్రికి బంపివేయుము.

భీమ:- అయ్యయ్యో? మిషనాస్పత్రియా? అక్కడ మాంసాహారము, మద్యపానము చేయు, జాతిలేనివారలతో కలసియుందువా? నీకు పుట్టిన శిశువు ఎక్కడ పెరగవలయును?

తార:- ఆమిషనువారే రక్షింతురు.

భీమ:- (కొంచెముసేపాలోచించి) ఇది ఎన్నటికినిగాదు. అట్లు చేసినయడల ఈ రహస్యము ఎప్పుడైనను బయటపడగలదు. అప్పుడునాపేరు నాశనమగును. నేచెప్పినపని నీవుచేసి తీరవలయును.

తార:- అయ్యో! నీవు ఆచారపరుడవే! ఇది పాపముగాదా?

భీమ:- పాపము! బయటపడిన పాపము! రహస్యముగానుండిన ఏమి పాపము? ఎవ్వరుచేయని పనిచేసిన పాపము ఏదో, ఎక్కడనో ఎవరికిని తెలియకుండా ఇట్టి కార్యము చేసిన అది పాపమెట్లగును? ఇట్టిది బహిరంగమైన ఆచారభంగమగును. సమాజము చెడిపోవును. మనోదు:ఖము కలగును. అందువలన పాపము కలుగును.

తార:- అదియేల? భర్త చచ్చిన వెంటనే, ఆడుదానికి దాని సహజమైన ప్రకృతికూడ చనిపోవునా? విధవల పుత్రుల మనుష్యులుకారా? ఇదివఱకు ఇట్టివారలు గొప్పగొప్ప కార్యములు చేయలేదా?