68
శారదలేఖలు
అచ్చట స్నానముచేసివచ్చి రైలులోనెక్కి పియర్ అను స్థానమునకు వెళ్లితిమి. అచ్చట విదేశమునుండి వచ్చుయాత్రికులను స్టీమరులోనుండి రైలులో కెక్కించుకొనుటకు రైలు, వంతెనమీదుగా స్టీమరువద్దకేగును. సముద్రమచ్చట అగాధముగా నున్నది. కాన తరంగము లుత్తుంగముగా వచ్చుచుండెను. మేమాప్రదేశమున కేగునప్పటికి దాదాపు పదునొకండు గంటలగుటచే నాపట్టపగటి యెండలో నీలమేఘశ్యామల కాంతులతో సాగరజలము రమణీయమై కన్పట్టుచుండెను. స్వచ్ఛమగు ధవళకాంతులీనెడు ఫేనములతోగూడి యువ్వెత్తుగ దూకెడి యాతరంగముల పోటుచూచుటకు విస్మయ జనకముగ నుండుటయేగాక భయంకరముగ గూడ నుండెను. రైలునిలిచిన గంటసేపు మాకా సాగరభంగములను యోధులునడచినట్లు బారుబారులై చనుదెంచు ఫేనమాలికలను చూచుటకే సరిపోయెను. ఈలోపుగ తోలుపెట్టెలు, పరుపుచుట్టలు, కాఫీ థెర్మాసులు,టిఫిన్ క్యారియరులు మొదలగు నాగరికపు ప్రయాణ వస్తువులతోను హ్యాటు, బూటు, సూటు, కంటియద్దములు, చేతికఱ్ఱలు మున్నగు అలంకారములతోడను స్వదేశీయులు విదేశీయులునగు నాగరికులెందఱో మాబండిలోనికెక్కిరి. అంత మా బండికదిలెను.
ధనుష్కోటినుండి వచ్చినవెనుకనే యెవరైనను దేవాలయములో నభిషేకములు అర్చనలు మున్నగునవి చేయవలెను. మేమును అట్లేచేసితిమి. దక్షిణదేశపు దేవాలయములన్నిటను