Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శారదలేఖలు

67

మధురలో మనస్త్రీలు మోజుపడి కొనుక్కొనెడి వంటసామానులు పిండివంటల పనిముట్లు అత్యధికముగా గలవు. రంగులద్దకమునకిక మధురఖ్యాతి సుప్రసిద్ధమేగదా.

అచటినుండి రామేశ్వరమున కేగితిమి. రామేశ్వరమొక చిన్నగ్రామము. పాడిపంటల సౌభాగ్య మేమూలను గానరాదు. ఇసుకతిప్పలు, తాటిచెట్లు, మొగలిపొదలు, నాగజెముళ్లుగలిగి నాజన్మస్థానమగు బాపట్లయెట్లుండునో అదియు నట్లేయున్నది. దక్షిణదేశపు దేవాలయము లన్నిటివలెనే రామేశ్వరపు ఆలయముగూడ గొప్పదేకాని పనితనమేమియు నంతగా గానరాదు. రామనాధపురపు రాజుల విగ్రహములును భక్తులవిగ్రహములును నచ్చటచ్చటనున్నవి.

ఒక్కదేవాలయపు ఆవరణయందే చతుర్వింశతి (24) తీర్థములున్నవి. అవిగాక ఊరివెలుపలగా లక్ష్మణతీర్థమను మఱియొక తీర్థమున్నది. రామేశ్వరము వెళ్ళినవారు మొట్టమొదట లక్ష్మణతీర్థమందు స్నానముచేసి ప్రాయశ్చిత్తాదులు గావించుకొనిన వెనుకనే యాత్రార్హత గలుగును. మేమును అట్లేచేసితిమి. తరువాత ధనుష్కోటికి వెళ్లితిమి. ధనుష్కోటికి రామేశ్వరమునుండి రైలుమీద వెళ్ళవలెను. ధనుష్కోటి వద్ద సముద్రుడు నిస్తరంగుడై యుండును, రత్నాకర మహోదధియను నుభయసాగర సంగమమని చెప్పుదురు. కాని ఆయుభయసాగర సంగమ మెచ్చటనో నాకు కానరాలేదు. అక్కడ యాత్రికులెల్లరు నూతనవస్త్రధారులై స్నానము గావింతురు.