66
శారదలేఖలు
నిపుణతను ప్రకటింపుచున్నది మధురరాజమందిరము. పదునాఱడుగుల చుట్టుకొలతగల పెద్దపెద్ద స్తంభములుగల యా రాజమందిరమందుగల శిల్పచాతుర్య మేమిచెప్పుదును? లతా వితానము లేమి? పుష్పమంజరులేమి, పక్షిజాతము లేమి? మనుష్య ప్రతిమలేమి!! ప్రతిశిల్పము యథాతథముగ నచ్చొత్తి నట్లుండెను. కల్యాణమండపమని యొకభాగము చూపిరి. అచ్చట పనితన మరయుటకు రెండుకన్నులు చాలవనిపించినది. దానికంటె రమణీయముగానున్నది శయ్యమందిరాంతర్భాగము. ఆయద్భుత శిల్పకళాభవన మరయుటచే విస్మయమును సంతసమును గలుగుటయేగాక నధికమగు విషాదముగూడ గలిగినది. అట్టియద్భుత శిల్పకళాసౌందర్యమున కునికిపట్టులైన యున్నతోన్నత గోపురప్రాకార హర్మ్యావళుల నిర్మించిన యాశిల్పులిప్పుడేరీ! ఆప్రభువులిప్పుడేరీ! ఎట్టికళలు నశించినవి? ఎట్టికళాకుశలు రస్తమించినారు! ఎట్టిరాజ్యములు రూపరినవి! ఎట్టిరాజులు దివంగతులైనారు! భూతవృంత్తాంతమును వర్తమానముతో బోల్చిచూచిన, మానసము దుఃఖసంతప్తమై నేత్రము లశ్రుసంసిక్తము లగునుగదా! అలనాడు రాజదర్బారులచే పూజితంబైన యాశిల్పకళామందిర మిప్పుడు దొరతనమువారి కచ్చేరీల కాశ్రయమైయున్నది. ఆదివ్యమందిరము కట్టుటకు ముప్పదైదు వత్సరములు పట్టెనట! సొమ్మెంత వ్యయమయ్యెనో!