Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శారదలేఖలు

43

"లేకపోయిన పునస్సంధాన కట్నమేమైన కావలెనా?"

"వద్దు”

“అయినచో నిరపరాధయగు నాబాలిక నకారణముగా నీవు విడనాడుటకు కారణమేమి?"

"ఏమో నేను చెప్పజాలను. ఆపిల్లయందునాకు భార్యావిషయ కానురాగము కలుగలేదు. కాన వద్దు”.

“ఏపాపమెఱుగని యాబిడ్డయందు నీవిట్లు నిర్దయుడవగుట తప్పుగాదా? నీవైనచో బుద్ధిపుట్టినప్పుడు మఱొక భార్యను పెండ్లాడుదువు. కాని నిరపరాధియగు నాబాలికకిక తరణోపాయమే లేదుగదా?"

“లేకపోవచ్చును. అది ఆమె తలిదండ్రుల లోపముకాని నాదికాదు. నా అయిష్టతను నేను నా వివాహకాలమందే సూచించితిని. ఆసంగతిని గమనింపకయే నాకు వారామెను గట్టిపెట్టిరి. కాన యామె సుఖము చెరచిన వారామె తలిదండ్రులేకాని నేనుగాదు. అట్టిజననీజనకుల కడుపున బుట్టినందులకామె యాదుఃఖ మనుభవింప వలసినదేకాని నేనేమి చేయుదును?"

“తల్లిదండ్రులు స్వతంత్రించి వివాహముచేయుట మనదేశములో ననాదిగ జరుగుచున్న యాచారము. ఆయాచారము మంచిదికానిచో నీబిడ్డలకు నీవట్లుచేయుట మానుము. కాని యొకతల్లిబిడ్డను నీ వీ విధముగా ఆ దురాచారమునకు బలిపెట్టవచ్చునా?”