శారదలేఖలు
33
ములఁ జిక్కుకొని యున్నసొమ్మును పాడుజేసికొని చేత నెఱ్ఱని యేగానిలేక మోసములు, దొంగతనములు, దౌర్జన్యములు చేసి, శిక్షలపాలై పడరానిపాట్లు పడెను. నేను పెద్దదాననైన తరువాతగూడ నన్నొకమారైన తనవద్దకు తీసికొనిపోలేదు. పైగ రెండు మూడు మాఱులు మా యింటికేవచ్చి నన్ను తిట్టియు కొట్టియు, బెదరించియు, నా వంటిమీదనున్న నగలు నాల్గుగూడ నూడ్చుకొనిపోయెను. కష్టమో సుఖమో మీరున్న చోటనే నేనుగూడనుందును. తీసికొనిపొండని కాళ్ళు కడుపులు పట్టుకొని బ్రతిమలాడితిని. ఇదిగో నదిగోయని దినములు గడుపుటయేగాని తీసికొని పోవనేలేదు. ఇఁకనేమిచేయుదును? పుట్టినింటి బానిసత్వము స్థిరమైనది. దుఃఖము శాశ్వతమైనది. అట్లెపడియున్నాను. ఇప్పుడా బానిసత్వమునకు గూడ ప్రాప్తిదీరినది. ఏలనందురా మా తండ్రిగారు గతించి పదిమాసములైనది. ఋణదాతలు యిండ్లు భూములు కట్టుకొని పోయినారు. పోగా మిగిలిన దేకొంచెమో చేతబట్టుకొని “నా బిడ్డ లిద్దఱకు నాకు రోజులు గడిస్తే అంతేచాలు. నీ కెక్కడతెచ్చి పెట్టగలను? నీదారి నీవు చూచుకొమ్మ"ని నాసవతితల్లి నన్ను సాగనంపినది. ఆమె వృత్తిగూడ నుత్తమముగా నుండక పోవుటచే నాకుగూడ నక్కడ నుండుట దుస్సహముగానే యుండెను. ఆమె వెళ్ళిపొమ్మనుటయే యొకవిధముగా మేలనుకొంటిని. కాని యెక్కడకు వెళ్లను ? ఇప్పటికి ముప్పదేళ్ళు నిండినవి. తండ్రి యిల్లుదప్ప వేఱుయిల్లె ఎఱుగను. నా సమస్తము