శారదలేఖలు
25
సౌభాగ్యవతియగు కల్పలతకు:-
నెచ్చెలీ,
మాసము దినములనుండి నా కొకటే రైలుప్రయాణము. అందువలననే నీకు జాబు వ్రాయుటకుగూడ వీలైనది కాదు. నీవు రెండుత్తరములు వ్రాసినను ప్రత్యుత్తరము వ్రాయకపోతిని. ఏమనుకొనుచుంటివోయని పలుమా ఱనుకొంటిని. కాని భుజించినచోట నిద్రింపక, నిద్రించినచోట భుజింపక నిరంతరప్రయాణము చేయుచున్న నేను నీకు జా బెట్లు వ్రాయుదును? కాన ఉత్తరము వ్రాయునప్పుడు నా యలసత్వమునకు క్షమింప వేడుకొనవచ్చునని మిన్నకుంటిని . జాబునకు జవాబువ్రాయక స్వస్తివాచకములు చదువుచున్నదని మిత్రమా, నాపై కినియకు. నీకు జాబు వ్రాయకపోయినను ఈ నెలదినముల రైలుప్రయాణములో నీకు పదిజాబులు వ్రాయజాలు పదార్థమును సేకరించుకొని వచ్చితిని సుమా! దాదాపు పగలు ఒంటిగంటవేళ మేము గూడూరులో తిరుపతిబండి దిగి చెన్నపురినుండి వచ్చు ప్యాసింజెరు నెక్కితిమి. నేను కూర్చుండిన స్త్రీలపెట్టెలో దాదాపు పదునాఱుమంది స్త్రీ లుండిరి. వారంద ఱొక్క కులమునకుగాని మతమునకుగాని భాషకుగాని చెందినవారుకారు. ఒకవైపున వైష్ణవస్త్రీ లిద్దఱు కూర్చుండి అరవమున మాట్లాడుచుండిరి. మఱియొక దిక్కున దత్తమండలమునుండి వచ్చు మధ్వస్త్రీ లిరు