Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

శారదలేఖలు

లక్ష్మియు సరస్వతియు కావచ్చును. కాని యట్టిశక్తి యిప్పుడు విూలో స్తంభించిపోయినది. ఎట్టి సాహసకార్యములనైన చేయవలసిన విూ రిప్పుడు బిడియమునకును పిఱికిఁదనమునకును గుఱియై యశక్తలై పోయినారు. సీత, సావిత్రి మున్నగు విదుషీమణు లిట్టిబిడియమును పిఱికిఁదనమును గలిగియున్నచో నట్టి ప్రసిద్ధములైన కార్యముల చేయగలిగెడి వారేనా? కృష్ణుని వంటి బిడ్డలను కనగలిగెడివారేనా? ఇప్పుడు చూడుడు! కృష్ణుని వంటి కుమారుఁ డెక్కడైన కన్పడునేమో?

విూరు కాశీరామేశ్వరాది పుణ్యయాత్రల చేయతలంచు చుందురు. కాని యది చిన్నతనమున చేయవలసినది కాదనియు వార్థక్యమే దానికర్హ సమయమనియు అప్పుడే దానధర్మాది పుణ్యకార్యముల చేయవలయుననియు విూతలంపు. కాని భూతదయాపశ్చాత్తాపములచేతను జాతిమత భేదములు లేని విశ్వమానవ భ్రాతృత్వముచేతను నకల్మష హృదయముచేతను మనతనువే పుణ్యక్షేత్రముగా జేసికొనవచ్చును. జీవితమే యాత్ర. అన్నిటికిని మనస్సే ప్రధానము. చిత్తసంస్కారములేని యాత్రలవలన ఫలములేదు. తోడి మానవుల నస్పృశ్యులనుగా భావించుట తప్పు. మానవులంద ఱొకటె. స్త్రీ ప్రేమకు స్థానము. ఒక జంతువును చూడుడు. దానిబిడ్డ నెవరైన నేమియైన చేయవచ్చిన నెట్లు పోరాడునో, అట్లే స్త్రీగూడ తన బిడ్డల కేమైన ప్రమాదము వచ్చినచో తన ప్రాణమునైన నర్పించుటకు సాహసించును. అట్టి ప్రేమను స్త్రీలొక్క తమ బిడ్డలవిూదనే గాక తమ యిరుగు పొరుగువారి విూదను తమదేశము విూదను