Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

శారదలేఖలు

హస్తీశ్వరుని యాలయము చాల గొప్పది. మన తెలుగుసీమలో నంత గొప్ప దేవాలయము వేఱొండు లేదని చెప్పుదురు. కడు చిన్నదియయ్యు స్వర్ణముఖినది యాక్షేత్రమునకు శోభను గూర్చుచున్నది, ఆదేవాలయమునం దఱువదిమువ్వురు భక్తులు గలరు. వారిలో నగ్రేసరుఁడు కన్నప్ప. కన్నప్ప స్వామికి గడు గూర్చిన భక్తుడు. స్వామి విగ్రహ మెచ్చట ప్రతిష్ఠితమై యున్న నచ్చట కన్నప్పవిగ్రహము ప్రతిష్ఠితమై యుండితీరును. మెరవడిసమయమున స్వామి కభిముఖుడై కన్నప్ప వచ్చును. స్వామి యాలయమునకు సమీపముగనే కన్నప్పకొండ యున్నది. కన్నప్ప కొడియనగా ధ్వజారోహణమైన వెనుకనే స్వామి కొడి. ఈ కన్నప్ప యింతటి సత్కారమునకు భగవదనుగ్రహమునకు పాత్రుఁడెట్లయ్యెనన నాతని చరిత్ర మిట్లు చెప్పుదురు.

కన్నప్ప యొక యెఱుకరాజునకు లేక లేక బుట్టిన కొడుకు. ఆతడొకనాడు వేఁటకుబోవ నచ్చట నీ ఈశ్వరలింగము కనుపించెను. దానిని చూడగనే కన్నప్ప భక్తిభరితుడై యా నాగలింగేశ్వరునకు నమస్కరించి యదివఱ కర్చకు డర్చించి పోయిన పుష్పపత్రాదులు తొలగఁద్రోచి సమీపారణ్యమునకుఁబోయి యొక పందిపిల్లను వేటాడి చంపి తెచ్చి దానిని పక్వముచేసి రుచికరముగ నున్నదో లేదోయని నోట వేసికొని రుచిచూచి రుచ్యముగ నుండుటకు సంతసించి యా నంజుడొక చేత బట్టుకొని బిల్వపత్రము లొక కొన్ని కోసి నెత్తిపై నిడుకొని యొకచేత నంజు డొకచేత విల్లునంబు లుండుటంజేసి యభి