6
శారదలేఖలు
సౌభాగ్యవతియగు కల్పలతకు :-
నెచ్చెలీ,
నీవు వ్రాసిన యుత్తరమందినది. మనము పూర్వము జాబులు వ్రాసికొనెడి కాలమునకును నేటికిని సమస్త విషయములయందు నెంతయో మార్పుగలిగినదని వ్రాసితివి. సత్యమే. కాని భాషావిషయమునగూడ మిక్కిలి మార్పుగలిగినదే, ఆవిషయము నీవేల గమనింపలేదు? గమనించియు ననర్హమని యుజ్జగించితివా? భారతి మున్నగు మాసపత్రికలలో వాడుక భాషయందు వ్రాయబడెడి కథలు, నాటకములు, ప్రహసనములు, చదివినకొలది నాకు వాడుక భాషయందు మక్కువెక్కువగుచున్నది. 'కథగాదు, కావ్యముగాదు, ఈ యుత్తరములలో మధురమైన వ్యవహారభాష మనమేల యుపయోగింపరాదు? సొగసైన వాడుకభాషలో లేఖలు వ్రాసికొనుటకు నీకుగల సందేహమేమియో తెలుపగోరెదను' అని వ్యవహార భాషయందు నీకుగల మక్కువకొలది కడు దీర్ఘముగ వ్రాసితివి. వ్యవహార భాషయందు వ్రాయుట నీకు ప్రీతికరమగుచో నీవటులనే వ్రాయుము. కాని యాంధ్రదేశమున నలువైపుల గ్రుమ్మరుచున్నకొలది వాడుకభాషయందు వ్రాయుట వలన గలిగెడి యిబ్బందు లధికముగ గన్పట్టుచున్నవి. ఆ విషయమై నాకుగల సందేహములను ననుభవములను రాగల లేఖలో విశదపఱచెదను. ఏలనందువా శ్రీకాళహస్తీ క్షేత్రమందు మహాశివరాత్రి సందర్భమున నేగాంచిన విశేషములు