శారదలేఖలు
3
గూర్చియు, స్త్రీల వారసత్వపు హక్కులను గూర్చియు, బాల వితంవులను గూర్చియు, వేశ్యా సంఘమును గూర్చియు ముత్తులక్ష్మమ్మగారు చెప్పిన విషయము లెంతయు నొప్పిదములై యున్నవి. అధ్యక్షుఁడు గూడ స్త్రీల యున్నతిని గూర్చియే బహు దూరము చర్చించెను. మహోత్సాహముతో శంకరనాయరుగారు గావించిన హెచ్చరిక యెంతయు సంస్తవనీయమై స్త్రీల కర్తవ్యము నుద్బోధింపుచున్నది. పెక్కుతీర్మానములలో స్త్రీలు పాల్గొని నిపుణముగ మాట్లాడిరి. ఆవిషయముల నెల్ల వివరింప నొక గ్రంథమగును. ఈచిన్న లేఖయందు వానినెల్ల వివరింప సాధ్యముగాదు. కాన ఆసభా విషయములఁ బ్రచురించిన వార్తాపత్రికలను దెప్పించి చదువుము. నీవు చదువుటయే గాదు - నీకు పరిచయముగల స్త్రీలకుఁగూడ చదివి వినిపించుము.
నెచ్చెలీ! నీ వదృష్టవంతురాలవు. నీపెనిమిటి న్యాయవాది యగుటచే నూరూరు దిరిగెడి యవస్థ నీకు లేదు. కడుపులో చల్ల కదలకుండ నుండవచ్చును. మా యుద్యోగమో అట్టిదికాదు. ఈ చెన్నరాజధాని యెల్లమాదే. క్రొత్తక్రొత్త ప్రాంతముల కేగుటయు అచ్చటి జనుల నడవడులను, ఆచారములను, వేష భాషలను ఆరయు చుండుటయు సంతోషకరముగనేయుండును. కాని మాటి మాటికి సామానులు సర్దుకొనుట — విప్పుకొనుట మాత్రము మిక్కిలి విసువును గలిగించుచుండును. అయినను నే నిప్పుడా పనికి చాల యలవాటుపడితిని. నెల కొక