సౌభాగ్యవతియగు కల్పలతకు:—
నెచ్చెలీ! నేడు చాల పుణ్యదినము. బహుకాలమునకు నీకు మరల నుత్తరమువ్రాయు భాగ్యము గల్గినది. అంతియేగాక స్త్రీజనాభ్యుదయమునకై నూతనముగా వెలువడిన మాసపత్రికయగు గృహలక్ష్మి మనయుత్తర ప్రత్యుత్తరముల నడిపెడు భారమును వహించినది. నిజముగా నిది మనకు మంచి సుదినము కాదా? సోదరీ, మన జాబు లిక నిరంతరాయముగ నడువ గలవని తలంచినపుడు నాకు మిక్కిలి సంతసము గలుగుచున్నది. మరియు నేటి మన యీలేఖల ప్రారంభకాలము గూడ మిక్కి_లి శుభావహముగనున్నది.
పూర్వము మనము జాబులు వ్రాసికొనెడు కాలమున కంటె నేడు మనస్త్రీలయం దున్నతి యత్యధికముగ గాన్పింపుచున్నది. మన భారతనారీమణు లంతర్జాతీయ సమావేశములకు ఖండాంతరముల కేగివచ్చుటయు, శాసన సభలలో సభ్యురాండ్రుగజేరుటయు, అంతియగాక డిప్యూటీ ప్రెసిడెంటు మొదలగు ఉన్నతపదవుల వహించుటయు, స్థానిక సంఘముల యందును, విద్యా సంఘముల యందును సభ్యురాండ్రగుటయు, ఆనరరీ మేజస్ట్రీటు పదవులనందుటయు, దేశీయసభలలో దేశ స్వాతంత్ర్యమునకును, సంఘసంస్కరణ సభలలో సాంఘిక