Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

194

శారదలేఖలు

దగ్గిఱగా నిల్చున్నారు. వారిలో ఒకబాలకు యేడేండ్లు వేఱొకదాని కై దేండ్లున్నట్టున్నవి. పెద్దదానిచేతిలో పేడపళ్లిక, చిన్నపిల్లచేతిలో పూలపుటిక ఉన్నవి. కాని పేడబుట్టలో పేడలేదు; పూలబుట్టలో పూలులేవు. వారి చిన్నిముఖములు మఱింత చిన్నబోయిఉన్నవి. "పేడా, పూలూ తెచ్చుకోక యిట్లా నిలబడ్డారే?”మని నేను వారిని అడిగితిని. “పోయివచ్చాము దొరకలేదు” అని ఆబాలికలు చిన్నబుచ్చుకొని పలికిరి. వారిని చూచుటకు నాకు జాలివేసెను. ఆపువేడయు పువ్వులును దొరకకపోవుటచే వారెంతో యుత్సాహభంగము పొందినట్టు గానుపించిరి. వారికన్నుల నీరొక్కటి తక్కువగాని వారిమోమంతగా ముడుచుకొనిపోయినది. మా కెదుటివీధిలో నున్న ఒకయిల్లుచూపి “వారింట చాలఆవులున్నవే, మీకు పేడెందుకు దొరకలేదు ?" అని వారిని మరల నేనడిగితిని. "ఆయింటి ముసలమ్మ చాలాచీకటి ఉండగానే లేచి లాంతరుపెట్టి పేడంతా వెదకి తట్టలోవేసి దాచిపెట్టిందట. మేముపోతే “అంతాయెవరో యెత్తుకొనిపోయినారు పొమ్మన్నది"అన్నారు ఆబాలికలు. “అయితే మీ అమ్మను పంపకపోయినారా? పెద్దవాళ్లువస్తే ఇచ్చేదేమో?" అన్నాను నేను. “మాఅమ్మ మ్రుగ్గులుపెట్టుతున్నది” అన్నా రాబాలికలు. అవును, అమ్మకు దగినపని అమ్మకు, బిడ్డలకుదగినపని బిడ్డలకు. ఆమె రంగవల్లులులేకున్న వీరి గొబ్బిళ్లకు శోభలేదు, వీరిగొబ్బిళ్లులేకున్న ఆమె రంగవల్లులకు రక్తిలేదు అనుకొంటిని. పేడదాచిన ముసలమ్మ పిసినారితనమునకు నాకు అసహ్యము గలిగినది. మాచిన్నతనములో