Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

192

శారదలేఖలు

సౌభాగ్యవతియగు కల్పలతకు : -

నెచ్చెలీ !

నీవువ్రాసిన ఉత్తరములన్నియు చేరినవి. కాని రెండు మాసములనుండియు నీవు లెక్కలేనన్ని లేఖల లిఖించుచున్నను నీకొక్క జాబునైన వ్రాయజాలనందులకు నాకు చాలవిచారమగుచున్నది. ఏమిచేయుదును? ఇంటిలో ఒంటరిదాననైనాను. కలముపట్టుటకంటె గరిటెపట్టుట అవసరమైన పనిగానున్నది. దానికితోడిది శీతకాలపుప్రొద్దు. ప్రొద్దుకు ముద్దకుసరి. ఇక నేను నీకు ఉత్తరమెప్పుడు వ్రాయుదును? అందువలననే తెల్లవాఱుజాముననైన వ్రాయుదుమని వాకిలిలో సంక్రాంతి దాసరివచ్చి “హారో, రంగ హారి, కసూరిరంగ, కావేటిరంగ’ అని కేకలుపెట్టగా మెలకువవచ్చి లేచి అతనికి పిడుకెడుబియ్యము వేసివచ్చి కలముకాగితము చేతబట్టుకొని దీపము ముందరవచ్చి కూర్చున్నాను. అయిననేమి ? కలముసాగునా? అదిగో ! “అమ్మా! వాకిట్లో నీళ్ళుచల్లడమైంది; మ్రుగ్గులు పెట్టుకొం”డని పనిమనిషి, అఱచుచున్నది.

ఈ ధనుర్మాసములో మనకిది యొకపెద్దపని. పగలు పదిరెండుగంటలు ఫెళ్లునవెలిగే సూర్యభగవానుఁడు జీత మాలస్యమైన కూలివానివలె పదిగంటలకాలమైనను పగలుచూపక పరుగెత్తిపోవుచుండగా ఇందులో ఒకగంట తనక్రిందకు లాగుకొనును సంక్రాంతిముగ్గు. పోనిమ్ము ఆలస్యమగునని యీ