Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

190

శారదలేఖలు

సిన ప్రయోజనము కలుగకపోవుటయు సురపత్‌సింగుగారి సవరణయొక్క ఫలితములుగా నేర్పడగలవు. కావున మిత్రమా! స్త్రీ జనాభ్యుదయచింతతోఁ జేయబడిన శారదాచట్టము యథారూపమున నమలులోనికైన రావలెను. లేదా అసలే రూపుమాసిపోవనైన పోవలెను; కాని సురపత్ సింగుగారి సవరణను మాత్రము దేశీయు లెంతమాత్ర మామోదింపగూడదు. అప్పటికప్పుడే శారదాచట్టమును రూపుచెడజేయ నెంచిన సింగుగారి సవరణకు ప్రజాభిప్రాయమును కనుగొనుటయను మఱియొక సవరణతో యమర్సనుదొరగా రించుక యడ్డుపడిరి. కాన ప్రజాభిప్రాయమునకై విడువఁబడిన ఈ సవరణను అనర్థక హేతువని పూర్తిగా నిరసించి దేశీయులు శారదాచట్టము యెడల తమకుగల సమ్మతిని తమ నిశ్చితాభిప్రాయము ద్వారా మరల నొకపరి దృఢపఱుపవలెను. ముఖ్యముగా నిది స్త్రీలకు సంబంధించినది గావున స్త్రీలెల్ల రీ సవరణవిషయమై తీవ్రప్రాతికూల్యమును జూపదగును. గృహలక్ష్మియు నిందులకు దోడ్పడవలెనని నా కోరిక.

మన చెన్ననగర మహిళాసంఘమువా రప్పుడే యీ సవరణవలని ప్రమాదమును గుర్తించి నిరసనసభ జరిపినట్లు పత్రికలలో జదివితిని. ఇది యెంతయు శుభావహము. ఇటులనే భారతదేశమంతట నీ సవరణకు తీవ్రప్రాతికూల్యమెదుర్కొను గాకయని యాశించెదను.