Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శారదలేఖలు

187

బిల్లు శాసనముచేయబడునా డిట్లు లేదు. పటేలు మహాశయు డధ్యక్షుడుగను, నెహ్రూ మాళవ్యా వంటి నాయకమణులు సభ్యులుగనునుండ ప్రభుత్వమువారును ప్రజాపతినిధులును మిల్కిలి సఖ్యతతోచేసిన శాసనము శారదాశాసనము. ఆశాసన మైన అప్పటికప్పుడే ప్రజల నెత్తిపై పెట్టలేదు. దాదాపైదు మాసములకు తరువాత నమలులోనికి వచ్చునట్లు నిశ్చయింపబడెను. ఆ అయిదుమాసముల గడువులో శాసనము రద్దుచేయ నెంచుచో సభ్యుల కవకాశము లేకపోలేదు. కాని ఆ అయిదు మాసములు శాసన ప్రతికూలు రెక్కడైన కునికిపాట్లు పడుచుండిరో లేక విపరీతముగాజరిగిన వివాహములలో విందులే గుడుచుచుఁడిరో తెలియదు. శారదాచట్ట మమలులోనికి వచ్చులోపల పూర్వాచారపరాయణులప్రేరణచే దేశీయులు గావించిన యనుచితవివాహములకు లెక్కలేదు. ఒక్క మచిలీపట్టణమునందే 900 వివాహములు జరిగినట్లు లెక్కింపబడెను. ఇక యావద్భారతదేశమునందును ఎన్నిలక్షల వివాహములు జరిగెనో వివరింపఁ దరముగాదు. దేశీయులెల్ల రా విధముగా కన్నులు తెఱువనివారును, పిడికిళ్లు విప్పనివారును, మాటలు రానివారును, నడకలు నేరనివారును అయిన కసుగందులకు గంగవెఱ్ఱులెత్తినట్లు పెండ్లిండ్లుచేయుచుండ నేడు సవరణ నామోదింప సాహసించిన శాసనసభ్యులలో నొక్కరైన 'దేశీయులారా ! భయములేదు. శారదాచట్టము రూపుమాపెద'మని చెప్పకపోయిరి. నాడుతోడ్పడి నేడు తాటస్థ్యమువహించిన ప్రభుత్వమువారైన సవరణ కవకాశముగలదని సూచింపరైరి.