శారదలేఖలు
177
కాదా? అట్లుగాక పురుషుడు తనసొమ్ము నెట్టిదుర్వ్యయము చేయక జాగ్రత్తపెట్టుచుండినచో దానిలాభము స్త్రీదిగాదా! స్త్రీ పురుషుల చేరికచే నేర్పడిన కుటుంబమునందు స్త్రీ చేసిన వ్యయము పురుషుని, పురుషుఁడుచేసినవ్యయము స్త్రీని బాధింపకుండుటెట్లు? అదియట్లుండ మద్యమువంటి దుష్పదార్థ సేవనముచేగల్గు హాని కేవల మార్థికమునకే సంబంధించినది గాదు. త్రాగుడు సర్వవిధభ్రష్టతకు కారణము. ఏస్త్రీయైనను భర్తచే నధికముగా బాధింపబడుచున్నదనుచో నామె త్రాగుబోతువానిభార్యయే యనుట నిక్కము. కావున స్త్రీ స్వయముగా త్రాగకపోయినను మద్యనిషేధయత్న మామెకు గాని పనియనుటకు-వీలులేదు. మిత్రమా! దుర్భరమగు ఎట్టి పన్నులకైన నోర్వవచ్చును. విదేశవస్త్రములనైన హర్షింపవచ్చును. కాని శరీరపోషణ కేమాత్ర మవసరములేనిదియు, నైతికముగా విశేష హానిని గల్గించునదియు, దుర్భరదారిద్ర్య కారణమును నగు త్రాగుడుమాత్రము వాంఛింపదగినదికాదు. విదేశవస్తువులవల్లగాని, పన్నులవల్లగాని మనుష్యునకు గల్గెడిహాని ధనలోపము మాత్రమే; కాని మధుపానరతిచే మానవుల మనుష్యత్వమే నశించిపోవును. మధుసేవకుల కుటుంబములు నరకసమములు. ఇట్లు వ్రాయుటచే విదేశవస్తువులనుగాని, అధికమగు పన్నులనుగాని హర్షించుచున్నానని భ్రమపడుచుంటివేమో? అదిగాదు. జలగలు రక్తమును పీల్చినచందమున నిరంతరము భారతీయుల ద్రవ్యమును పీల్చివేయుచున్న విదేశపుసరుకులును,