170
శారదలేఖలు
కాదర్శము. మహాత్ముడు చెఱసాలకేగునపుడు భార్య కేమి చెప్పుదురని యడుగ "నే నేమియుచెప్ప నక్కఱలేదు. ఆమె చాల ధీరురాలు" అనెనట. నేడు భారతనారీమణులెల్ల రట్టి ధీరురాండ్రు కావలెను. జిలుగువస్త్రములందును, నాగరికపు పరికరములందును, భోగద్రవ్యములందును మోహమును విడనాడుకొనవలెను. ఆత్మసమర్పణమునకు భారతసాధ్వి, పేరుమోసినది. కష్టసహిష్ణుత నామెకు నేర్పవలసిన పనిలేదు. త్యాగశీలత నామె వల్లెవేసినపాఠమే. ఆమెకు కావలసినదెల్ల స్వాతంత్య్రము. భారతదేశము బ్రిటిషుప్రభుత్వవశగతమై యున్నట్లు భారతసాధ్వి పురుషహస్తగతయైయున్నది. ఆ పిడికిలి సడలెనా భారతమహిళ సామర్థ్యజ్యోతియొక్క యుజ్వలకాంతి దృగ్గోచరమగును. అదిగో! అప్పుడే కనుము. భర్తలయొక్క ఆజ్ఞచే స్వతంత్రతనుబడసి కార్యక్షేత్రమున ప్రవేశించిన భారతమహిళామతల్లుల యుజ్వలనామము లెట్లు పునఃపునఃపఠనీయములై తనరారుచున్నవో! ఆంధ్రదేశమున లక్ష్మీబాయమ్మ, మద్రాసు రాజధానీనగరమున దుర్గాబాయమ్మ, గుజరాతిరాజ్యమున కస్తూరిబాయి, బొంబాయియందు కమలాదేవి ఛటోపాధ్యాయినీసరోజనీదేవులు, సంయుక్తరాష్ట్రములలో నెహ్రూకుటుంబపు అత్తకోడండ్రు యెట్లు కార్యశూరురాండ్రై విరాజిల్లుచున్నారో!
దుర్గాబాయమ్మగారిని - నేను గత నవంబరునెలలో జరిగిన ఆంధ్రమహిళాసభలో గాంచితిని. వయసు పాతికేండ్ల