Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శారదలేఖలు

159

వివాహములు చేసినంత మాత్రమున శారదాచట్టమునుండి వీరెట్లు రక్షింపబడిరి ? ఇక సృష్టి ఆగిపోవునా? ఆడుపిల్లలు పుట్టరా ? పెండ్లిండ్లుకావా? అయ్యో? ఎంత చేదస్తులు. 'మన మీపిల్లలకు వివాహము చేసినమాత్రమున నేమైనది? ఎట్లు కావలసిన దట్లగు' నని వీరేల స్థిమితహృదయులు కాగూడదు? పాపము ! తమ తమ ఆతురతకొలది పసిబిడ్డలగొంతులు కోయుచున్నారుగదా! కల్పలతా! ఏస్త్రీల యభ్యుదయము కొఱకై యీ శారదాచట్టము సృష్టింపబడినదో ఆస్త్రీల నీ రెండుమూడు మాసములలో జరిగిన యక్రమపు వివాహముల క్లేశ మర్ధశకాబ్దము పీడించును. ఇప్పు డవిమర్శకముగా పెండ్లి చేయబడిన యీ బాలదంపతులు పెద్దవారైన వెనుక అప్పుడు జరుగుచున్న ప్రౌఢవివాహముల గని కుతూహలమతులై తమ దాంపత్యములను చిందఱవందఱ చేసికొనినచో నప్పు డీ పరమశ్రోత్రియులగు తలిదండ్రులేమి చేయుదురో ? నేడు నవనాగరికులు సైతము 'కూడునా, కూడదా' యని శంకింపుచున్న 'డై వోర్సుచట్టము'ను ఆనా డీశ్రోత్రియసంఘమువారే ఆడుబిడ్డల ఘోషచూడలేక ఆహ్వానింపవలసి వచ్చునేమో గదా? దేశకాలపాత్రములను గుర్తింపక తొందరపడుట యెందును లాభకారిగాదు. నేడు శిశువివాహములకు సహాయభూతులై శారదా చట్టమునకు వ్యతిరేకప్రచారము గావించుచున్న శ్రోత్రియంమన్యు లీవిషయమును గమనింపకుండుట విచారకరమే గాదు ముందున కపాయకరముగూడ నగును సుమా.