శారదలేఖలు
157
టిని. కాని విరామ మెఱుగని మేళతాళములవలన నిద్రకుమాత్రమవకాశము లేకపోయినది. ఆ ఒక్కనాడేగాదు. మార్గశీర్ష మంతయు నిట్టి జాగారముల తోడనే గడచినది. అమావాస్య వచ్చినది. “నే డమావాస్య. రాబోవునది శూన్యమాసము. ఇక మేళతాళముల గొడవ యుండదు; ఈనాడైన సుఖముగా నిద్రింత”మని పడుకొంటిని; కాని ఆ రాత్రి కూడా నాగాలేదు. ఒక వూరేగింపురానే వచ్చినది. ఆ పిల్ల మూడేండ్లు నిండియు నిండని పసికూన. కట్టుకొనిన క్రొత్తపరికిణి యెత్తియెత్తి దులుపుకొనుచు, తొడుగుకొనిన పట్టుచొక్కాను పట్టిపట్టి చూచుకొనుచు బొమ్మల పెండ్లిండ్లలోని బొమ్మవలె కూర్చున్నది. పెండ్లికొడుకో పదేండ్లవాడు. నిద్రచే తూగుచున్నాడు. మతిమాలిన తలిదండ్రులు తమపై వైచిన సంసారభారము నా బాలదంపతులెఱుగరుగా! బహుశః యీ వైవాహికోత్సవము గూడ వారికి జ్ఞాపకముండదు. కాని యీ తంతులవలన కలుగబోయెడి కష్టనష్టములకు మాత్రము వారు బాధ్యులు. అకటా! ఎట్టి ఘోరతరాన్యాయము. తలచిన మసస్సు క్షోభజెందుచున్నది. దానితరువాత మఱినాలుగుదినముల కొకయూరేగింపు వచ్చుచున్నది. ఆ వధూవరు లిరువురు సరిగా యెనిమిదేండ్లవారు. పిల్లవాడు నల్లమొఖమల్‌లాగు, కోటు, వేసికొని యున్నాడు. పిల్లకొక పెద్దచీర చుట్టబెట్టి పొదలకమ్మవలె కూర్చుండ బెట్టినారు. ఆ బాలిక యా చీరలోబడి చిక్కములో పిట్టవలె కొట్టుకొనుచున్నది. రానున్న శాసనమువలని భయముచే సనాతనధర్మపరులలో కొంతసంస్కారము కలిగినది.