Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

శారదలేఖలు

నగునుగాని నీనాటకరంగ ప్రవేశోద్యమసమర్థనముకొఱకు స్త్రీలనెల్లర కట్టగట్టి యిట్టి హేయమగు నిందకు గుఱిసేయుట కడుంగడు సాహసమే గాక యక్రమమనియు బల్క సాహసించినందుకు క్షమింపకోరెదను.

నాటకరంగమున స్త్రీలుచేరుటచే చెడిపోవుదురని నందులకు ఇప్పుడు బాగుగా నున్నవారెవ్వరు? వరించిపెండ్లాడని వానియందు ప్రేమ యెట్లుకుదురును? కాన యిప్పుడు మన స్త్రీలు చేయునది యంతయు పరపురుషసహవాసమేయని వాదింప దగునా? పతిచే పలుబాములు పడుచున్నను ఆతనినే దేవునిగా భావించి బూజించుచున్న వారును, పతి విగతజీవుడుగా సర్వము వర్జించి వీరవైరాగ్యము సలుపుచున్నవారును నైన మన భారత మహిళల హృదయమెఱుగక నీవు వ్రాసిన వాక్యములు వారి మానసము నెంత నొవ్వచేయునోగదా?

జ్ఞానముచే మనస్సును పరిపక్వము చేసికొనిన వారికి పరపురుష సాన్నిధ్యభీతి లేదని వ్రాసితివి. మంచిది. నీవు సుశిక్షితలనుగా జేసిన కులీనస్త్రీ లట్టివారే గావచ్చును. కాని వారితో నభినయింపవచ్చిన పురుషులుగూడ నట్టివారు కావలెనుగదా. సరి. యత్నముమీద వారినిగూడ మంచివారినే సంపాదించెద రనుకొందము. కాని చూడవచ్చిన వారుగూడ బ్రహ్మజ్ఞానులు కావలెనుగదా. లేకున్న వారిచే నైన హేళనలు తప్పవుగదా. సోదరీ! ఏవేషభాషలు లేక బడికివెళ్ళి చదువుకొనివచ్చు కన్యలకే యిక్కాలమున మగ