Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

శారదలేఖలు

సోదరీ! నా కీకల్లోలము చూచుటకు చాలకష్ట మనిపించెను. “మన స్త్రీలలో విద్య యెప్పుడు పెంపొందును? ప్రపంచజ్ఞాన మెప్పు డలవడును? సహన మెప్పు డొదువును? తమ దేశసౌభాగ్యమునుగూర్చి జాతిసౌభాగ్యమునుగూర్చి ఎప్పుడు తెలిసికొందురు?" అను మహావిచారముతో మందిరమువీడి వెలుపలికి వచ్చుచుంటిని. ఇంతలో ద్వారముకడ నొకబాలుడు నిలువబడి మన 'గృహలక్ష్మి' పత్రికను చేతి కందించెను. ఆపత్రికను చూచినతోడనే "నే నింటింట ప్రవేశించుట చేతనే మీ మౌఢ్యము తొలగగలదు" అని యా సంచిక మౌనముతో జబాబిచ్చుచున్నదాయనుకొంటిని.

ఇంతియేగాదు. కల్పలతా! వీధిలో నేగోడపై చూచినను గృహలక్ష్మీకరపత్రములే. తెనాలిస్టేషను చేరినది మొదలు మనగృహలక్ష్మి పెక్కుమంది స్త్రీపురుషుల హస్తభూషణమై యలరారుటగన నాకెంతయో ముదంబు గొల్పెను. నిరంతర పత్రికాపఠనమే మనకు జ్ఞానప్రదాయిని కావలెను. మఱియు సభలు నిర్ణీత సమయముల వేళతప్పక జరుపుకొనుటయు సహనము వీడక సభలోని యుపన్యాసములు నాలించుటయు మనస్త్రీలు నేర్చుకొనవలసిన ముఖ్యాంశములుగా నాకాసభలు గనుటవలన తోచెను.


భావపురి

మిత్రురాలు,

డిసెంబరు 1929

శారద.