Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శారదలేఖలు

139

లాడ దొడంగిరి. అందఱొకమారుగ నేల మాట్లాడెదరు మీరు గూడ శారదాశాసనముపై మీఅభిప్రాయము తెలుపుడనిన వినిపించుకొనరు. తాము అఱచుటమానరు! ఒకటేరొద. ఆనాడు మన స్త్రీల అశిక్షితవ్యవహారము బాగుగా విశదమయ్యెను. వైద్యుని ఔషధమున కొప్పుకొనిన తరువాత ఆతఁ డొసగిన చేదుమందుగాని వెగటుమందుగాని ఘాటుమందుగాని విసుగుకొనక వర్జింపక యెట్లు పుచ్చుకొందుమో అటులనే సభలకేగెడు వారుగూడ హితాహితములగు విషయములను వినుటకు తగుసహనమును ఓపికను కలిగియుండుటవిధి. పలువిషయములను చర్చించెడు సభలకేగి మాచెవి కింపైన మాటలనే చెప్పుడు లేకున్న నల్లరిచేయుదుమనుట యసభ్య లక్షణము. కాని పురుషుల సభలలోనే యిట్టి సభానీతి భగ్నమగుచుండుట మనము నిత్యము వినుచున్నమాటయే. ఇఁక ప్రపంచజ్ఞానములేని మనసంగతి చెప్పవలసినదేమి? శారదా చట్టమునుగూర్చి యూరక యుబుసుపోక వాదోపవాదములు చేసికొనుటయేగాని దాన ప్రయోజనమేమి? అది రాజశాసనము. అనుకూలురకును ప్రతికూలురకును తప్పదు. ఇది యుపన్యాసకురాండ్రు తెచ్చిపెట్టినదికాదు. వృద్ధాంగనలు దులుపుకొనినపోదు. కాని సభాప్రేక్షకురాం డ్రావిషయమై యోచింపరైరి. అది ఆయుపన్యాసకురాండ్రే తెచ్చినటుల భ్రమపడి కంగారుపడిరి. ఇచ్చవచ్చినటుల సభలో కేకలు పెట్టిరి. అంతతోఁ బోక వీధి పొడుగునను నోటికి తాళముతీసి బారలుసాచిరి.