Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శారదలేఖలు

137

చిన పేముపరిశ్రమాలయపు అంగడి పూలపుటికలు, తములపాకుల పళ్లెరములు, బిడ్డల ఉయ్యాలలు, పెట్టెలు మున్నగువానితో నొప్పి జనుల నధికముగా నాకర్షింపుచుండెను. ఇన్నిటిమధ్య శారదానికేతనమువారి చిన్నయంగడి పెద్దస్వాగతపటమును గట్టుకొని నికేతనపు బాలికల రచనాకౌశలమునకును, ఉన్నవదంపతుల కార్యదీక్షకును నిదర్శనమై తనరారుచుండెను. వీని నన్నిటిని చూచునప్పటికే ప్రొద్దుక్రుంకెను. ఆసాయంత్రమే స్త్రీలక్లబ్బులో శ్రీ ముత్తులక్ష్మమ్మాళ్ గారికి సన్మానపత్రము సమర్పింపబడుచుండెననియు చాలమంది స్త్రీలక్కడ కరిగిరనియు తెలిసెను. కాని వ్యవధి లేకుండుటచే మే మటకరుగలేదు.

మూడవనాడు అనగా 5-11-29 తేదీని రామమోహన గ్రంథాలయభవనములో స్త్రీల బహిరంగసభయని ప్రకటన పత్రికలు పంచిపెట్టబడెను. దాదాపు మూడుగంటలవేళ ఆమందిరమున కరిగితిమి. పురస్త్రీలు కొందరప్పటికే యట కరుదెంచి కూర్చుండియుండిరి. కాని ఆసభకు నిర్వాహకురాండ్రెవరో యేర్పాటుచేసిన వారెవరో కనుపింపలేదు. గత రెండుదినముల సభలకు కర్తృత్వము వహించిన వారెవ రాసభకు హాజరుకాలేదు. ఇదియేమి ఆశ్చర్యమని యోచించుచుండగా ఇదివారికి సంబంధించినది కాదనియు, పట్టణకాంగ్రెసు సంఘమువారి యేర్పాటనియు కొందఱు చెప్పిరి. ఓహో! అనుకొని ఎవరైన నాయకురాండ్రరుదెంచెదరేమో మఱికొంచెముసేపు చూచి పోవుదముగాక యని మేముగూడ కూర్చుంటిమి.