ఈ పుట అచ్చుదిద్దబడ్డది
vi
పోలేదు - నేపాళమునుండి సేతువుచూడవచ్చిన యొక వృద్ధాంగనయందు ద్యోతకమయిన మతవిశ్వాసము పుణ్యకాంక్షయు శారద కద్భుతజనకములయ్యెను - 'మతసూత్రమె యావద్భారతీయులను ఐక్యపఱుచుచున్నది - మతము మానవునకు ప్రాణముకంటె నుత్కృష్టము!' అని శారద నిశ్చయము చేసికొనెను.
శారద సంతానవతియై, విద్యాభాగ్యములం దింకను వన్నెగాంచి యుండెనేని, ఆమెయనుభవము మఱింతవిస్తరించి యీరచయిత్రి, భాగ్యవతుల బాధ్యతలను, కనిపెంచెడి యిల్లాండ్ర కష్టసుఖములనుగూడ బాగుగ విమర్శించి యుండెడిదని పాఠకలోక మాశింపవచ్చును. కాని, యాపరిస్థితులలో మొదలు శారద గ్రంథరచనమునకె మోసము గలిగెడిదేమో ! కావున చదువరులకును సంతృప్తియె శ్రేయోదాయకము. శారదముద్దు పలుకులు, శారద నిష్కపటహృదయము, శారద యవ్యాజసౌజన్యమును, పాఠకావళి హృదయములు రంజింపఁజేసి, వారినీ లేఖల ద్వితీయభాగమున కెదురుచూచునట్లు చేయఁజాలియున్నవి