Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శారదలేఖలు

125

సౌభాగ్యవతియగు కల్పలతకు : —

నెచ్చెలీ !

నాజీవము ధర్మము. నామతము నీతి. నా లక్ష్యము సతీశ్రేయము. ఈమూటిని సమర్థించుటకే నేను చేతకలము బూనితిని. ఎప్పు డీయాశయత్రయము ననుష్ఠింపజాలకపోదునో ఆనాడు నావ్రాఁతకోఁతలు కట్టిపెట్టుదును. న్యాయమునకు నేను కేలుమోడ్తును. నిష్పాక్షికతకు నేను శిరమువంచుదును. నాకొకరు హితులులేరు. ఒకరహితులులేరు. యుక్తాయుక్తవిచక్షణలేక మతమును నిరసించెడు దురాచారులు నా కెట్లహితులో మతముపేరిట ప్రజలను పీడించెడి దుండగీండ్రును నాకట్లే అహితులు. సాంఘికధర్మముల విచ్ఛిత్తిఁజేయనెంచెడి దుష్ప్రారంభులు నాకెట్లమిత్రులో, సాంఘికరక్షణా వ్యాజమున జనులనలయించెడివారు గూడ నాకట్లేఅమిత్రులు. నిష్కారణముగా భార్యను దుఃఖపెట్టెడి దుర్జనుడు నాకెట్లు కోపకారణుఁడో, భర్త నల్లాడబెట్టెడి దుశ్చరితయు నాకట్లే శత్రురాలు. అభము శుభము నెఱుగని పసిబాలయగు కోడలిని కోడంట్రికముపెట్టెడి అత్త నాకెట్టి శత్రువో, అత్తపొత్తుగిట్టని గయ్యాళియు నాకట్లే పగతురాలు. దేశములోని సదుద్యమముల నిర్మూలింప యత్నించెడి దుశ్శీలురు నాకెట్టి పగతురో, దురుద్యమముల వ్యాపింపఁజేయువారును నాకట్లే పగతురు, దూషణభూషణతిరస్కారములు శరీరమునకు గాని యాత్మకు