Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శారదలేఖలు

109

మైన భారతమహిళ నేడు నాటకకళకు బలియై తన పూర్వౌన్నత్యమును చెఱుచుకొనుట యుత్కృష్టమో, నాటకకళకు లోపముకల్గిన గల్గుగాక తన శీలమునే ప్రాథాన్యముగా బెట్టుకొని నాటకరంగములకు వెలిగానుండుట యుత్కృష్టమో, స్త్రీలును స్త్రీసంఘాభ్యుదయపరులగు పురుషవరేణ్యులును యోచింతురు గాక.

దూకుదూకుమనువారేగాని తోడు దూకువారుండరు. స్త్రీ లిందు పాల్గొనుటవలన దేశ మభివృద్ధిజెందుననియు, నాట్యకళ పెంపొందుననియు, స్త్రీ పురుషులు యోగ్యులై యున్నచో వా రెంత కలిసి మెలసియున్నను ప్రమాదము లేదనియు, కళాభిమానులగువారు తమ యుద్యమవిస్తారమునకై పలుతెఱగుల సమాధానములు చెప్పి స్త్రీల నాకర్షింప వచ్చును. కాని నాటకములాడు స్త్రీలనుగాంచి లఘుభావమున పలుగాకిమూకలాడు ప్రల్లదముల నాప వీరితరమా?

మహాత్మునివంటి యుత్తమోత్తమ పురుషవరేణ్యునిచే నడుపబడుచున్న సబర్మతీ సత్యాగ్రహాశ్రమమును బోలు నిష్ఠురనియమవిధానములుగల సంస్థయందే స్త్రీ పురుషులలో లోపములు గననయ్యెనని మహాత్ముడు వలవల విలపించినాడు. శీలభంగభయముచేతనే స్త్రీ పురుషులు కలిసి పనిచేసెడు ఫ్యాక్టోరీ విధానమును మహాత్మునివంటి ప్రాజ్ఞులు నిరసింపుచున్నారు. అట్టిచో నిక నాటకరంగములా స్త్రీల మర్యాదను చెక్కు చెదరకుండ రక్షింపునవి ?