Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

iii

మహిళాసభపై 'శీత కన్నువేయుటకు' శారద మిగుల కనలెను. అచట జరిగిన యింకొక సభలో స్త్రీలు నలువైపులదిరిగి గలగల మాటలాడుట చూచిన శారదకు, ‘ఆనాఁడు మన స్త్రీల అశిక్షితవ్యవహారము బాగుగ విశదమయ్యెను.' శారదాచట్టము చర్చకువచ్చినప్పుడు, 'ఇచ్చవచ్చినట్లు స్త్రీలు సభలో కేకలుపెట్టిరి. అంతతోఁబోక, వీధిపొడుగునను, నోటికి తాళముదీసి, బారలుసాచిరి !'

పూర్వాచారమను పేరుతో ప్రజానుమోదమువడసిన ప్రాఁత చెడుగులవలెనే, నవనాగరకపుముసుఁగుతో నిర్భయముగ నడయాడు నూతన దురభ్యాసములును, శారదకుఁగంటకసదృశములె! శారదాశాసన చర్చ సందర్భమున గ్రంథకర్త్రికిఁగల చక్కని స్వతంత్రబుద్ధి సునిశిత మేధాశక్తియు వ్యక్తమగుచున్నవి. దక్షిణాదినుండి తనతో రెయిలు ప్రయాణముచేసిన తరుణులనోటనే శారద యీచర్చ సాగించెను. బాల్య వివాహానర్థముల వాతఁబడిన ముగ్గురు ముదితలుచెప్పిన తమ దైన్యవృత్తాంతములవలననె యచటి స్త్రీ జనమునకు శారదాచట్టము సమ్మతమయ్యెను. స్త్రీలు నాటకరంగ మెక్కవచ్చునను లక్ష్మీదేవమ్మగారి వాదనను, శారద తన దీర్ఘ లేఖావాక్యములచే తుత్తునియలుచేసెను. ‘తలిదండ్రు లెవరి కొసఁగిన వారినే పరదైవము గా నెంచి ప్రేమించి గౌరవించెడి హిందూ స్త్రీలు, చిత్తమొకనికి శరీరమొకనికి నొసంగుచున్నారని నీవు వ్రాసిన వ్రాత మిక్కిలి యనుచితము * * నీమతమే నిజమగుచో, మన తల్లులు, పుత్రికలు, * * వేయేల భారతమహిళలెల్లరు, చెడ్డవారే యనవలసి వచ్చును. సోదరీ! మన వివాహసంస్కారమునందు లోపములున్న సంస్కరింపనగును గాని, నీనాటకరంగప్రవేశోద్యమ సమర్థనముకొఱకు, స్త్రీల నెల్లర కట్టగట్టి, యిట్టి హేయమగు నిందకు గుఱిసేయుట కడుంగడు సాహసము, అక్రమము!'