Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

శారదలేఖలు

బసచేయుటకు వసతియైన సత్రములేక మేము చాలశ్రమపడితిమి. ఇది యీక్షేత్రమునకు గొప్పకొఱతయనియు, స్వతంత్రముగా యాత్రజేసికొన తలంచెడువారికి గొప్పయిబ్బందియనియు చెప్పక తప్పదు. మేము శ్రీరంగములో మూడు పూటలు మాత్రమే యుంటిమి. రెండుమాఱులు శ్రీరంగశాయిని దర్శించితిమి. పూజార్చనాదులు గావించితిమి. తిరుమణి తిరుచూర్ణములు గొంటిమి. ఆదేవుని ఆలయమందే దేవుని ప్రసాదమని అరిసె, జంతిక, మున్నగు భక్ష్యములు, పెరుగన్నము, పులిహోర, పొంగలి, మున్నగు అన్నపుముద్దలను వైష్ణవస్వాములు విక్రయించు చుండిరి. అదియైన యేబుట్టలోనో తట్టలోనో బెట్టుకొనికాదు. నలుగురును నడిచెడి వట్టిరాతిబండలమీద వేసికొని యమ్ముచుండిరి. దైవసంబంధముగా నది యెంత పూజ్యతమమైన ప్రసాదమైనను పారిశుద్ధవిషయముగా జూచితిమేని అది యొత మాత్రము పరిగ్రహింప దగినదికాదు.

శ్రీరంగమునందు కావేరి రెండుపాయలుగా చీలి రంగని ఆలయమును చుట్టిపాఱుచున్నది. తల్లి బాహులమధ్య నొదిగి నిలిచిన తనయునివలె ఆ యుభయకావేరీమధ్యనున్నాడు రంగశాయి. అచ్చటికి సమీపముననే జంబుకేశ్వరమను పుణ్యక్షేత్రముగలదు. సాయంత్రపువేళ నచ్చటికేగి స్వామినిదర్శించితిమి. ఆస్వామిపేరుకూడ జంబుకేశ్వరుడే. ఆయనదేవేరి అఖిలాండేశ్వరి. జంబుకేశ్వరాలయము గూడ చాలగొప్పదే గాని బహిర్భాగమంతయు శిథిలమగుటచే మరలకట్టుచున్నారు.