Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"శారద లేఖల”ను గుఱించి నా యభిప్రాయము

(రాయసం వెంకటశివుఁడు, గుంటూరు.)


ఆంగ్లసారస్వతమున స్త్రీహృదయ మంతగ ప్రస్ఫుటమగుచుండ లేదని యొకశతాబ్దము క్రిందట ఇంగ్లీషురచయిత జాను స్టువర్టుమిల్లు మొఱపెట్టెను. -ప్రశ్తు తాంధ్రవాఙ్మయమున నట్లే స్త్రీ రచనావిషయిక మగు కఱవు మిక్కుటముగనున్నది. మనదేశమున నిదివఱకు పురుషుఁడే, స్త్రీ స్వభావమునుగుఱించి పుస్తకరచన చేసెను; స్త్రీల హక్కులను గూర్చి సభలలోఁ బ్రసంగించెను; వార్తాపత్రికలలో వ్యాసరాజములు వ్రాసెను. ఇపుడు స్త్రీలు ముందడుగువేసి, తమ సంగతులు తామె ప్రస్తావించుకొనుచున్నారు. శ్రీమతి కనుపర్తి వరలక్ష్మమ్మగారు శారద లేఖలు తెనుఁగుసారస్వతమందలి యీకొఱఁతను గొంత తీర్చుచున్నవి. ఆంగ్లవిద్యనేర్చి పట్టపరీక్షలందు జయమందకున్నను, వరలక్ష్మమ్మగారు, పాశ్చాత్యవిద్యావిధానముల చొప్పుననె చదువుకొని, ఇంగ్లీషు నభ్యసించిన యువతులకు సామాన్యముగ సాధ్యముగాని పాండిత్యప్రకర్షయు వివేచనా శక్తియును సంపాదించి, తేటతెలుఁగున రమ్యగ్రంథరచన యలవఱచుకొనిన సాధ్వీమణి.

శారదాకల్పలతల మధ్య నడచినలేఖలను పేరుతో, శ్రీమతి వరలక్ష్మమ్మగారు ప్రస్తుతకాలమందలి ముఖ్యవిషయములు చర్చించి లిఖించిన వ్యాసావళియె యిది. ఇవి స్వల్పసంగతులనియు, ఇవి మహద్విషయములనియు, శారద విచక్షణచేయదు. సంక్రాంతి ముగ్గులవలెనే సరోజినీ