80
శారదలేఖలు
దక్షిణదేశమున పెక్కు దేవాలయములను దేవతలను దర్శించి హర్షించితిమి. కాని అవి అన్నియు మానవుని బుద్ధివైశద్యమునే విశదీకరించెనుగాని భగవన్మహిమను తేటపరుపవయ్యె. నిజమగు భగవన్మహిమను పడమటి కనుమలయందే గంటిమి. ప్రకృతియందు పరమాత్ముని గనెడు బ్రహ్మవేత్తల కీప్రకృతి దృశ్యమెంత యాత్మానందమును గూర్చునోగాని మూఢులకే జ్ఞానోదయమును గలిగించునట్లున్న దాకనుమలసొంపు. ఉన్నతములగు నాపర్వతశృంగములను గాంచినప్పుడు భగవంతుని యౌన్నత్యమును, ఆకొండలపై నుండి భూమిపైకుఱికి జలజల బాఱు సెలయేళ్ళను గనినప్పు డాపరమేశ్వరుని దయాపరత్వమును, చిత్రవిచిత్ర పత్రపుష్పఫలభరితపాదపావళుల గాంచినప్పుడు జగదీశ్వరుని సృష్టికళానిపుణత్వమును, కలకలమని మంజులధ్వనిసేయు ఖగగణంబుల కూజితంబు లాలించినప్పుడు విశ్వకర్తయొక్క మృదుమధురమనోజ్ఞ వాక్కును, స్ఫురించి యొడలు పులకించుచుండెను. విశ్వగర్భుని స్వరూపసాక్షాత్కారము నిజముగా మాకక్కడనే గోచరమయ్యెనని చెప్పవచ్చును. భగవంతుని మహావిభూతి కాకనుమలు నిదర్శనములు. సర్వేశ్వరుని సర్వాంతర్యామిత్వమున కవి తార్కాణలు. కల్పలతా! వేయిమాటలేల? అచ్చటి సృష్టిసౌందర్యము అనుభవైక వేద్యమే గాని వర్ణనాతీతము.
ఈ విధముగా ఆప్రకృతి సౌందర్యమును చూడంజూడ మనం బానందనిమగ్నమగుచుండ కొండనెత్తములపై నాకుటిండ్లు